పీవీకి భారత రత్న ఇవ్వాలి 

బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలనుగాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆయనకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యకె చంద్రశేఖరరావు కోరారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడిని కలిసి తానే స్వయంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సిఎం పేర్కొన్నారు. 

పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించారు.

పివి జన్మదినమైన ఈ నెల 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో నిర్వహించే ప్రధాన కార్యక్రమంతో శతజయంతి ఉత్సవాలు ప్రారఁభం అవుతాయని తెలిపారు.

అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు చెప్పారు. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలని సూచించారు.

ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి ఐదు కాంస్య విగ్రహాలను నెలకొల్పేందుకు వెంటనే ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో పివి చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్ లో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇందుకు కెకె నేతృత్వంలోని కమిటి సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి పివి మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలని కోరారు.