బెడిసి కొట్టిన భారత్ ను బెదిరించాలనే చైనా వ్యూహం 

పెద్ద సైన్యాన్ని చూపి భారత్ ను  బెదిరించాలన్న చైనా వ్యూహం బెడికొట్టిందని  అమెరికా నిఘా వర్గాలు వంచన వేస్తున్నాయి. గాల్వన్ లోయలో జూన్ 15 రాత్రి భారత దళాలపై చైనా సైనికుల దాడికి చైనా సైన్యంలోని సీనియర్ జనరల్ ఆదేశించినట్లు ఆ  వర్గాలు వెల్లడించాయి. ఈ ఆదేశాల గురించి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

జూన్ 15-16 మధ్య రాత్రి భారత సైనికులపై చైనా సైనికులు దాడికి పాల్పడటంతో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు, దాదాపు 76 మంది గాయపడ్డారు. దీంతో ఆసియాలోని అతి పెద్ద దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని శాంతియుతంగా చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. 

అమెరికా నిఘా వర్గాల మదింపుతో అత్యంత సమీప సంబంధంగల వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం వెస్టర్న్ థియేటర్ కమాండ్, అధిపతి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో సుదీర్ఘ కాలం నుంచి పని చేస్తున్న జనరల్ ఝావో జోంగ్‌కి భారత దళాలపై దాడి చేయాలని చైనా సైనికులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 

ఉత్తర భారత దేశం, నైరుతి చైనా మధ్య సరిహద్దుల్లో దాడి చేయాలని ఝావో ఆదేశించారని, భారత దేశానికి గుణపాఠం చెప్పేందుకు గాల్వన్ లోయలో దాడి ఉపయోగపడుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. 

జనరల్ ఝాంగ్ గతంలో భారత్-చైనా మధ్య అనేక ప్రతిష్టంభనలను అత్యంత సమీపం నుంచి పరిశీలించినవారిలో ఒకరు. భారత దేశంతో సహా, అమెరికా, దాని మిత్ర దేశాల  దోపిడీని నివారించేందుకు, చైనా బలహీనంగా కనిపించకూడదని ఆయన అంతకు ముందు పేర్కొన్నారు. 

జూన్ 15న జరిగిన దాడిలో చైనా సైనికులు 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడి అంతకు ముందు జరిగిన తీరులో లేదు. పరిస్థితి అదుపు తప్పినందువల్ల అప్పటికప్పుడు జరిగిన దాడిలా కనిపించడం లేదు. చైనా తన బలాన్ని చాటుకునేందుకు, తన బలాన్ని భారత దేశానికి చూపించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి చేసినట్లు కనిపిస్తోంది. 

అయితే ఈ దాడి వల్ల చైనాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని అమెరికా నిఘా వర్గాలతో సన్నిహిత సంబంధంగల వర్గాలు చెప్తున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ లో చైనా వ్యతిరేకత పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ దేశానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

భారతీయులు చైనీస్ సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ను డిలీట్ చేస్తున్నారని, చైనా తయారీ ఫోన్లను ధ్వంసం చేస్తున్నారని, ఇది చైనా సైన్యానికి విజయం కాదని స్పష్టం చేశాయి. చైనా కోరుకున్నదానికి విరుద్ధంగా జరిగినట్లు తెలిపాయి. 

భారత దేశంలో 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి చైనీస్ టెక్ కంపెనీ హువాయ్ సహాయం తీసుకోరాదని చాలా కాలం నుంచి అమెరికా భారత దేశానికి చెప్తోందని పేర్కొన్నాయి. 

మరోవైపు..  సెన్‌కాకూ ద్వీపాలపై తన అజమాయిషీని సుస్థిరం చేసుకునేందుకు జపాన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ ద్వీపసముదాయమున్న ప్రాంతాన్ని అధికారికంగా పేరు మార్చడం ద్వారా వాటిపై చట్టపరంగా పూర్తి హ్కక్కులు తమవేనని చైనాకు జపాన్ చెప్పకనే చెప్పింది.