ముంబై ఉగ్రదాడి కీలక వ్యక్తి అమెరికాలో అరెస్ట్ 

2008లో ముంబై లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం గల కెనడాకు చెందిన వ్యాపారవేత్త అమెరికాలో శిక్షకు గురైన పాకిస్థాన్ మాజీ సైనిక వైద్యుడు తహవ్వుర్‌ రానా లాస్ ఏంజెల్స్ లో అరెస్ట్ అయ్యారు.అతని అప్పచెప్పమని భారత్ కోరడంతో అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ లో జన్మించిన ఈ కెనడా దేశస్థుడిని త్వరలో భారత్ కు పంపే అవకాశం ఉంది. ఇక్కడ ముంబై ఉగ్రదాడి కుట్రలో విచారణ ఎదుర్కొంటాడు. 
 
తహవ్వుర్‌ 2008లో జరిగిన ముంబై దాడులకు ఆర్థిక సాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షికాగో కోర్టు అతడికి 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికే పదేండ్ల శిక్షను పూర్తి చేసుకున్న అతడు.. కరోనా వైరస్‌ సోకి తన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంటూ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే, నేరస్థులను అప్పగించే ద్వైపాక్షిక ఒప్పందం-1997 ప్రకారం.. తహవ్వుర్‌ను అప్పగించాలని ఇటీవల అమెరికాను భారత్‌ అభ్యర్థించింది. ఈమేరకు అతడిని జూన్‌ 10న లాస్‌ఏంజిల్స్‌ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారని అమెరికా అసిస్టెంట్‌ అటార్నీ జనరల్‌ జాన్‌ జే లులేజియన్‌ తెలిపారు. పలు హత్యా, కుట్ర నేరారోపణలలో అతనిని అప్పచెప్పమని భారత్ కోరుతున్నది.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మరో నిందితుడు డేవిడ్‌ హెడ్లీ తహవ్వుర్‌కు చిన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం ఇతను అమెరికా జైలులో 35 ఏళ్ళ శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే అతని అభ్యర్ధన మేరకు అతనిని భారత్ కు అప్పచెప్ప లేదు. దాడులకు ముందు ముంబైలో తుది రెక్కీ నిర్వహించింది  తహవ్వురేనని  విచారణలో భాగంగా హెడ్లీ గతంలో వెల్లడించాడు.  
 
ముంబై ఉగ్రదాడులలో అతని పాత్రకు ఇంతకు ముందు అరెస్ట్ చేసినా అమెరికా ప్రాసిక్యూటర్లు అతనిపై నేరుగా ఉగ్రదాడులతో సంబంధం ఉన్నదని నిరూపించలేక పోయారు. ముంబై దాడులకు ప్రధాన కారణమైన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ తాయిబాకు మద్దతు ఇచ్చినందుకు చికాగోలో శిక్ష విధించారు. 2015లో ప్రోఫెట్ ముహమ్మద్ కార్టూన్ ప్రచురించిన దైనిష్ వార్తాపత్రికపై ఉగ్రదాడి జరపడం కోసం కూడా మద్దతు ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 
చికాగోలో గల తన ఇమ్మిగ్రేషన్ లా వ్యాపారం బ్రాంచ్ ను ఉగ్రదాడికి ఒక ముసుగుగా ముంబైలో చేసుకోవడానికి హెడ్లిని రానా అనుమతించాడని భావిస్తున్నారు. హెడ్లీ తాను ఒక ఉగ్రవాదికి శిక్షణ సమకూర్చిన్నట్లు రానాకు తెలిపాడని  కూడా ప్రాసిక్యూటర్ చెప్పారు. అలాగే ముంబైలో, ముఖ్యంగా ఉగ్ర దాడి జరిగిన తాజ్ హోటల్ లో హెడ్లీ జరిపిన ముందస్తు చర్యల గురించి కూడా అతనికి తెలుసని పేర్కొన్నారు. 
 
పాకిస్థానీ తండ్రి, అమెరికా తల్లికి జన్మించిన హెడ్లీ 1971 యుద్ధం సందర్భంగా తన పాఠశాలను భారత సేనలు ధ్వంసం చేసేనప్పటి నుండి తనలో భారత్ పై ద్వేషం ఏర్పడినదని చెప్పాడు. సినీ నిర్మాత మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ కు అతను సన్నిహితుడని భావిస్తారు. ముంబై ఉగ్రదాడికి ముందుగా ఆ రోజున ముంబై వెళ్లవద్దని రాహుల్ భట్ ను హెచ్చరించిన్నట్లు తెలుస్తున్నది.