తెలంగాణలో రాజ్యమేలుతున్న అవినీతి 

తెలంగాణలో రాజ్యమేలుతున్న అవినీతి 

తెలంగాణ ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరుగుతుందని చెబుతూ తెలంగాణ లో అవినీతి రాజ్యమేలుతోందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ సంవాద్ ర్యాలీ లో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు. అధిక కరోనా టెస్ట్ లు చేయడంలేదని, మరణాల  రేటు 3శాతం పైగా ఉందని చెప్పారు.

డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం ప్రభుత్వం గాలికొదిలేసి, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను మాత్రం రూ.85వేల కోట్ల కు పెంచారని మండిపడ్డారు.  ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేస్తోందని జేపీ నడ్డా విమర్శించారు.

రేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల పాలన కాలంలో దేశం అరవై ఏళ్ల ప్రగతిని సాధించిందని తెలిపారు.  మోదీ రెండో సారి పగ్గాలు చేపట్టాక అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించిందని కొనియాడారు.

‘‘కరోనా విషయంలో మోదీ చర్యలను ప్రపంచ దేశాలు పొగిడాయి. కానీ దేశంలో మాత్రం  పార్టీలకు రాజకీయాలే ముఖ్యం. దేశాన్ని నడిపించడం లో మోదీ కి విజన్ ఉంది. దేశం ముందు సంక్షోభం తలెత్తినప్పుడు గతంలో యావత్ దేశం ఏకతాటిపై నిలిచింది. కానీ ఇప్పుడు విపక్ష కాంగ్రెస్ విచిత్రంగా వ్యవహరిస్తోంది” అంటూ ధ్వజమెత్తారు.

ఆర్టికల్ 370 రద్దు తో జమ్మూకాశ్మీర్ పూర్తిగా దేశంలో అంతర్భాగం అయ్యిందని చెబుతూ  9 కోట్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్న ట్రిపుల్ తలాక్ కు స్వస్థి పలికారని గుర్తు చేశారు. సీఏఏ సవరణ ద్వారా శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించారని, రామజన్మభూమి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు.