చైనాలో మరోసారి కరోనా పంజా  

చైనాలో మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. ముఖ్యంగా రాజధాని బీజింగ్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతున్నది. అక్కడి అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన జిన్‌ఫడి ఇందుకు కేంద్రబిందువుగా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్‌ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. 

హోల్‌సేల్‌ మార్కెట్‌ సమీప ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించడమే కాకుండా, దాదాపు 90,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. బీజింగ్‌లో గత 24 గంటల్లోనే 27 కొత్త కేసులు నమోదైనట్లు బీజింగ్‌ నగర అధికార ప్రతినిధి జు హెజియాన్‌ తెలిపారు.

హోల్‌సేల్‌ మార్కెట్‌లో కరోనా ప్రబలిన ఈ ఐదురోజుల్లో బీజింగ్‌లో మొత్తం 106 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇందులో 76 కేసులు హోల్‌సేల్‌ మార్కెట్‌కు సంబంధించినవే. మే 30 నుంచి దాదాపు 2 లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శించినట్లు అంచనా. జన్యుక్రమాన్ని బట్టి వైరస్‌ ఐరోపా నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.