భారత్‌ కంటే పాక్ వద్దే ఎక్కువ అణ్వాస్త్రాలు

భారత్‌ కంటే చైనా, పాకిస్థాన్‌ వద్దే అణ్వస్ర్తాలు ఎక్కువగా ఉన్నట్లు స్వీడన్‌కు చెందిన మేధోసంస్థ ‘స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి)’ వెల్లడించింది. గత ఏడాది కాలంలో భారత్‌, చైనా తమ అణ్వాయుధాలను గణనీయంగా పెంచుకున్నాయని తెలిపింది. 

చైనా సుమారు 320 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లను కలిగి ఉండగా, భారత్‌ వద్ద 150, పాకిస్థాన్‌ వద్ద 160 వార్‌హెడ్‌లు ఉన్నట్లు తన ఇయర్‌ బుక్‌-2020లో వివరించింది. మరోవైపు, 2019లో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. 

ప్రపంచ అణ్వాయుధాల్లో 90 శాతం వాటా కలిగిన అమెరికా, రష్యా.. కాలంచెల్లిన తమ అణ్వాయుధాలను ధ్వంసం చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తరకొరియా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నాటికి ఈ తొమ్మిది దేశాల్లో మొత్తంగా 13,400 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి వెల్లడించింది. 

కాగా, గతంతో పోలిస్తే చైనా ఇటీవల తరచూ తమ అణ్వాయుధాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నదని సిప్రి పేర్కొంది. అలాగే తన అణ్వస్త్ర సంపత్తిని కూడా ఆధునీకరిస్తున్నదని తెలిపింది. మరోవైపు, భారత్‌, పాక్‌ కూడా క్రమంగా తమ అణ్వాయుధాల సంఖ్యను, వాటి వైవిధ్యతను మెరుగుపరుచుకుంటున్నాయని వివరించింది. అయితే భారత్‌, పాక్‌తోపాటు పలు దేశాలు తమ అణ్వాయుధాల సమాచారం వెల్లడించడం లేదని సిప్రి ఆరోపించింది.