ఇమ్రాన్ ఖాన్ పై పాక్ సైన్యం అసంతృప్తి  

ఇమ్రాన్ ఖాన్ పై పాక్ సైన్యం అసంతృప్తి  

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆ దేశ సైన్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం విఫలమైందని సైన్యం దుయ్యబడుతోందని సమాచారం. 

 పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త, పాత్రికేయుడు వాజిద్ షంసుల్ హాసన్ మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనుసరించిన కోవిడ్-19 నిరోధక విధానాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఇది పాకిస్థాన్ నియంత్రణలో ముందు సీట్లోకి జనరల్స్ రావడాన్ని సమర్థిస్తోందని చెప్పారు. అయితే అధికారికంగా మార్షల్ లాను ప్రకటించలేదని పేర్కొన్నారు. 

సివిలియన్ కేడర్‌లోకి లెఫ్టినెంట్ జనరల్స్‌ను నియమించారని తెలిపారు. ప్రాధాన్యతగల ప్రభుత్వ పదవుల్లో ప్రస్తుత, మాజీ మిలిటరీ అధికారులను నియమించినట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థకు కూడా మిలిటరీ అధికారిని నియమించారని చెప్పారు. 

పాకిస్థాన్‌లో కోవిడ్-19 మహమ్మారి తీవ్రతపట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి అష్ట దిగ్బంధనం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మార్చిలో తొలిసారి పాకిస్థాన్‌లో కోవిడ్-19 కనిపించింది. 

సింధ్ ప్రభుత్వం విధించిన అష్ట దిగ్బంధనాన్ని ఇమ్రాన్ వ్యతిరేకించారు. పేద దేశం కాబట్టి ఇటువంటి చర్యలు లాభదాయకం కాదని తెలిపారు.