ఉద్ధవ్ థాకరే అస్థిరతకు సోనియా యత్నం!

మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వ పార్టీ అయిన శివసేన అధినేతను ముఖ్యమంత్రిగా చేయడానికి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఎమ్యెల్యేల తిరుగుబాటు భయంతో ఒప్పుకొనక తప్పలేదు. 
 
ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఎన్సీపీ అధినేత శరద్ పవర్ బలమైన రాజకీయ శక్తిగా మారడం, కాంగ్రెస్ మూడో భాగస్వామి కావడంతో ఒక విధంగా అవమానపరంగా భావిస్తున్నారు. మరోవంక థాకరే ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపిపై తిరుగుబాటు జరిపినా, సీఎం పదవి వారించినా తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లతో  సామరస్యంగా వ్యవహరించడం కాంగ్రెస్ అధినాయకత్వానికి చిరాకు కలిగిస్తున్నది.
 
పైగా, అయోధ్య, వీర సావర్కర్ వంటి అంశాలపై శివసేన తన ధోరణులను విడనాడక పోవడం కూడా ఆగ్రహం కలిగిస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింతగా కుంచించుకు పోవడమే గాని బలం పెంచుకోలదని భయపడుతున్నారు. 
 
పైగా పాలనా వ్యవహారాలలో శరద్ పవర్ సలహాలకు ఇస్తున్న థాకరే కాంగ్రెస్ వారిని అసలు పరిగణలోకి తీసుకొనక పోవడంతో అసహనానికి లోవవుతున్నారు.  అందుకనే థాకరేను ఇరకాటంలో పెట్టడం కోసం `అధికార మార్పిడి’ అనే నినాదాన్ని అనూహ్యంగా కాంగ్రెస్ నేతలు లేవదీస్తున్నారు.
పూర్తిగా ఐదేళ్లపాటు సీఎంగా ఉండే షరతు పైననే థాకరే ఈ కూటమికి ఒప్పుకున్నారు. అందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా అప్పట్లో ఒప్పుకున్నాయి. కానీ ఇప్పుడు ముగ్గురూ సమానంగా అధికారమూ, బాధ్యతలు పంచుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాం అంటూ వివాదాలు సృష్టించడం ద్వారా కాంగ్రెస్ అస్థిరతకు దోహదపడే విధంగా వ్యవహరిస్తున్నది.

ఒక వంక దేశం మొత్తం మీద మూడొంతుల కరోనా కేసులు మహారాష్ట్రలోని ఉండడంతో ప్రభత్వ పాలనా యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు రాజకీయ వివాదాలను లేవదీస్తున్నారు. 

ఈ విషయమై  కాంగ్రెస్ నేతలు సీఎం ఉద్ధవ్‌తో వచ్చే వారం భేటీ కావడానికి సమాయత్తం అవుతున్నారు. ‘‘కొన్ని విషయాలు, పరిణామాలపై మా పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది. వాటిని సీఎం ఉద్ధవ్‌తో కలిసి చర్చించి… పరిష్కరించుకుంటాం’’ అంటూ ఓ కాంగ్రెస్ నేత ప్రకటించారు.