ఐదు నగరాలలోనే సగం కరోనా కేసులు 

ఒక వంక దేశంలో కరోనా కేసులు  మూడు లక్షలకు డాటగా ఈ కేసులలో సగం వరకు  ఐదు నగరాలలోని ఉన్నట్లు తెలుస్తున్నది. దానితో కరోనా పరిధి పరిమితంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. గణాంకాలను బట్టి ఈ ఐదు నగరాల్లలో మొత్తం 1,51,000కు పైబడి కేసులు ఉన్నాయి. 

నగరాలు రాజధాని ఢిల్లీ (36,824), మహారాష్ట్రకు చెందిన ముంబాయి (55,451), పుణే (11,000 పైన), థానే (సుమారు 16,000)లతో సహా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ (సుమారు 16,000), తమిళనాడుకు చెందిన చెన్నై (సుమారు 27,000), రాజస్థాన్‌లోని జైపూర్‌. 

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో 55,451 కేసులు నమోదయ్యాయి. స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఈజిప్ట్‌, యుఎఈ తదితర దేశాల్లో కేసుల కంటే ఈ సంఖ్య అధికం. ఇప్పటి వరకూ 2,000కి పైగా  మరణాలు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం 36,824 కేసులు నమోదు కాగా, వీరిలో 1,214 మంది మృతి చెందారు. 13,398 మంది కోలుకున్నారు. 

ముంబైలో 99 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయినట్లు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అలాగే 94 శాతం వెంటిలేటర్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయని తెలిపింది. 

చెన్నైలోనూ వైరస్‌ తీవ్రంగానే ఉంది. తమిళనాడులో శనివారం నాటికి 40,698 కేసులు నమోదుకాగా, వాటిలో 70 శాతం చెన్నైలోనివే. ఇప్పటి వరకూ 27,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర థానే నగరంలో 16,000కు పైగా కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకూ 400 మంది మృతిచెందారు. 

గుజరాత్‌లో మొత్తం 22,527 కేసులు నమోదు కాగా, ఒక్క అహ్మదాబాద్‌లోనే 16,000 కేసులు నమోదయ్యాయి. భారత్‌ 3,08,993 కేసులతో అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 1,45,779 కేసులు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 8,884 మంది మృతి చెందారు. 1,54,329 మంది కోలుకున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,458 మందికి వైరస్‌ సోకింది. దేశంలో 49.95 శాతం రికవరీ రేటు ఉంది. అలాగే కరోనా ల్యాబ్‌లను 642కు, ప్రైవేట్‌ ల్యాబ్‌లను 243కు పెంచారు. దీంతో దేశంలో మొత్తం 885 ల్యాబ్‌లు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,43,737 మందికి టెస్టులు చేశారు. ఇప్పటి వరకూ 55,07,182 మందికి కరోనా టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, కేరళలో తొలిసారిగా అఫెరిసిస్‌ పద్ధతిలో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స అందించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి  నుంచి ప్లాస్మా సేకరించి అఫెరిసిస్‌ విధానంలో 51 ఏండ్ల కరోనా రోగికి ఎక్కించారు. ఈ విధానం విజయంవంమైందని, రోగి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.