ఢిల్లీలో కరోనా బెడ్ల కోసం 500 రైల్వే కోచ్‌లు   

ఢిల్లీలో కరోనా బాధితులకు బెడ్ల కోసం 500 రైల్వే కోచ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు హోమ్ మంత్రి అమిత్ షా తెలిపారు.  దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తో ఆదివారం భేటీ అయ్యారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌, హెల్త్‌ మినిస్టర్‌‌ హర్షవర్దన్‌, స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

ఢిల్లీలో కరోనా వ్యాప్తి కోసం కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయపడుతుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు. రైల్వే కోచ్‌లలో పథకాలే కాకుండా కాకుండా కరోనాతో పోరాడేందుకు అవసరమైన అన్ని ఎక్విప్‌మెంట్స్‌ను ఇస్తామని అన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు తదితర ఎక్విప్‌మెంట్‌ ఇస్తామని భేటీ అనంతరం అమిత్‌ షా ట్వీట్‌ చేశారు

రెండు రోజుల్లో ఢిల్లీలో  కోవిడ్‌ టెస్టులను రెట్టింపు చేస్తామని, ఆరు రోజుల్లో కరోనా టెస్టుల సామర్ధ్యం మూడింతలు చేస్తామని తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతి ఇంట్లో సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఆ జోన్లలో ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహించాలని చెప్పారు.   

కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్‌ రూపొందిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో కరోనా కట్టడికి ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమిస్తామని చెప్పారు. కరోనాపై పోరులో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్‌, స్వచ్ఛంద సంస్థల సేవలు వాడుకుంటామని అమిత్‌ షా ప్రకటించారు.

 ప్రైవేట్ ఆస్పత్రులు 60 శాతం బెడ్లు తక్కువ ధరకే ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా చికిత్స, టెస్టింగ్‌ ధరలపై డాక్టర్ పాల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హోమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

చిన్న హాస్పిటల్స్‌లోని వారికి కరోనా ట్రీట్‌మెంట్‌పై ఫోన్‌లో గైడెన్స్‌ ఇచ్చేందుకు ఎయిమ్స్‌లోని సీనియర్‌‌ డాక్టర్స్‌తో ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌‌ను కూడా ప్రారంభించనుంది.