పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్‌లో విలీనం కావాలని భావిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. మోదీ నాయకత్వంలో రాబోయే సంవత్సరాల్లో జమ్మూకాశ్మీర్ విధి చిత్రం మారుతుందని భరోసా వ్యక్తం చేశారు.
ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘జమ్మూ జన సంవాద్ ర్యాలీ’లో ప్రసంగిస్తూ ‘‘కొన్ని రోజులు ఆగండి… పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అయిపోతామని డిమాండ్ లేవనెత్తుతారు, పాకిస్తాన్ ఏలుబడిలో ఉండమని కరాఖండిగా చెబుతారు. ఇలా జరిగిన రోజు పార్లమెంట్ లక్ష్యం నెరవేరినట్లు.’’ అని ఆయన వెల్లడించారు.
గతంలో ‘ఆజాదీ కశ్మీర్’ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తానీ, ఐసిస్ జెండాలు ప్రదర్శించేవారని, కానీ ఇప్పుడు కాశ్మీర్ లోయలో కేవలం భారత జెండాలతోనే నిరసనలు చేస్తున్నారని రక్షణ మంత్రి గుర్తు చేశారు. “ప్రధాని మోడీ నాయకత్వంలో చాలా నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఆర్టికల్ 370 ను రద్దు చేయడం వాటిలో ఒకటి” అని చెప్పారు.
ఆర్టికల్ 370 ను రద్దు చేయడం గురించి రక్షణ మంత్రి వివరంగా ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వానికి ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టం చేసారు. “జనసంఘ్ రోజుల్లో పార్టీగా మా వాగ్దానం నెరవేరింది. మేము గత సంవత్సరం అధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆర్టికల్ 370, 35ఎ తొలగించబడ్డాయి ”అని సింగ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను ప్రధాని మోడీ ఇనుమడింప చేసారని చెబుతూ ప్రపంచ శక్తులు మన దేశాన్ని నేడు గౌరవిస్తున్నాయని గుర్తు చేశారు. “అంతకుముందు, అంతర్జాతీయ వేదికలలో, చాలా దేశాలు కాశ్మీర్, ఆర్టికల్ 370 విషయంలో పాకిస్తాన్‌తో కలిసి ఉండేవి అది ఇప్పుడు అలా కాదు” అని సింగ్ పేర్కొన్నారు.
చైనాతో సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదం విషయంలో దౌత్య, మిలటరీ స్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయని చెబుతూ జాతి ప్రతిష్ఠ విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
‘‘సైనిక, దౌత్య స్థాయిల్లో చైనాతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటామని చైనా కూడా వెల్లడించింది. ఈ విషయంలో మాత్రం ఏదీ దాచిపెట్టం. ప్రతిదీ వెల్లడిస్తాం’’ అని స్పష్టం చేశారు. చైనాతో సరిహద్దులు పంచుకున్న సరిహద్దుల వద్ద పూర్తి ప్రశాంతంగానే ఉందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి