కిందికుంట చెరువు వద్ద ఎమ్యెల్యే గాంధీ దౌర్జన్యం 

శేరిలింగపల్లి నియోజకవర్గం హైదర్ నగరం గ్రామంలో గల 
కిందకుంట చెరువు కబ్జా విషయంలో ఎమ్యెల్యే అరెకపూడి గాంధీ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. చెరువు అభివృద్ధి పేరిట ప్రైవేట్ వ్యక్తులతో లారీలకొద్దీ మట్టిని అందులో నింపివేసి చదునుచేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు ప్రతిఘటిస్తుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
 
స్థానికులు చెరువు భూమి కబ్జాపై ఫిర్యాదు చేయడంతో చెరువు పూడ్చే పనులను నిలిపి వేయడంతో ఆగ్రహంచెంది  అనుచరులతో శనివారం అక్కడకు చేరుకొని స్థానికుల ముందే రెవిన్యూ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారు. చివరకు పనులు నిలిపి వేసిన దళిత మహిళా రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను   స్థానికుల ముందే కాగితాలతో కొడుతూ దురుసుగా  వ్యవహరించారు. 
 
సభ్య సమాజంలో ఒక ఎమ్యెల్యే ఈ విధంగా ప్రవర్తించడం  అత్యంత గర్హనీయమైన సంఘటన అని శేరిలింగంపల్లి బీజేపీ ఇన్ ఛార్జ్ జి యోగానంద్  విమర్శించారు.  ఎమ్యెల్యేపై  ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
యోగానంద్అ ఆధ్వర్యంలో బిజెపి బృందం ఆదివారం అక్కక్కడకు వెళ్లి, స్థానిక ప్రజలను జరిగిన సంఘటన గురించి విచారించారు. వారంతా ఎమ్యెల్యే దౌర్జన్యం పట్ల తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి బిజెపి అండగా ఉంటుందని వీరు హామీ ఇచ్చాము. ఈ సంఘటనపై జాతీయ ఎస్సి కమీషన్ స్పందించాలని ఆయన కోరారు.
 
ఈ విధంగా అధికారులను భయపెట్టి, వారిని లొంగదీసుకుని అడ్డుఅదుపు లేకుండా చెరువుల ఆక్రమణకు ఒక పద్దతి ప్రకారం  ప్రయత్నం చేస్తున్నారని యోగానంద్ ఆరోపించారు. ఇటువంటి చెరువుల కబ్జాదారులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహం, మద్దతు లభిస్తున్నట్లు భావించవలసి వస్తున్నదని చెప్పారు. 
 
చెరువు భూమిని కబ్జా చేసుకొని అక్కడ నాలుగైదు అంతస్థుల  భవనాలు నిర్మింపచేసే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు సొంత నిధులతో ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నామని చెప్పి, స్థానిక ఇరిగేషన్ అధికారుల సహకారంతో చెరువును పూడ్చివేసె ప్రయత్నం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఇటువంటి పనులకు ఎమ్యెల్యే అండగా ఉన్నట్లు కనబడటం పలు అనుమానాలకు దారితీస్తుందని యోగానంద్ చెప్పారు. చెరువు అభివృద్ధి అంటే మొత్తం చేయాలి గాని, కొద్దీ భాగం చేయడం కబ్జాదారులకు మాత్రమే ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. ఈ విధంగా చేసి చెరువులను ఆక్రమించడం హైదరాబాద్ లో ఒక వరవడిగా మారిందని ధ్వజమెత్తారు. 
 
నీటిపారుదల, రెవిన్యూ, మునిసిపల్ శాఖల అనుమతులు లేకుండా ఏ విధంగా చెరువులు, కుంటలను దత్తత పేరుతో మట్టి నింపివేయగలరు? అందుకు ఎమ్యెల్యే ఏ విధంగా అండగా ఉంటారు?  అంటూ ప్రశ్నిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చెరువు దురాక్రమణకు అడ్డుకట్ట వేయాలని యోగానంద్ డిమాండ్ చేశారు. 
 
మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కబ్జాదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దురాక్రమణదారుల నుండి చెరువుకు, స్థానిక ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నగరంలో చెరువులను కబ్జా దారులనుండి కాపాడటం కోసం బిజెపి నిలబడుతుందని హామీ ఇచ్చారు.