కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఉపాధి అవకాశాలు గతంలో ఎన్నడూ లేనంత భారీగా దెబ్బతింటున్నాయి. రానున్న మూడు మాసాల్లో 5 కంపెనీలు మాత్రమే కొత్త నియామకాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. అయినా దేశంలో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయి.
మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర ఉపాధి రేటు 5 శాతంతో 15 ఏళ్ల కనిష్ట స్ధాయికి పడిపోయింది. దేశవ్యాప్తంగా 695 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అయితే సానుకూల నియామక ధోరణిని కనబర్చిన 44 దేశాల్లో భారత్ టాప్ 4 స్థానంలో ఉండడం ఆశాజనకం కలిగిస్తున్నది.
ఆర్థిక మందగమనం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్పొరేట్ ఇండియా ఉద్యోగుల నియామకాల్లో హేతుబద్ధంగా వ్యవహరిస్తోంది. లాక్‌డౌన్ పూర్తిగా తొలగిన అనంతరం డిమాండ్ పెరగనుందని, దానికి అనుగుణంగానే నియామకాలు ఊపందుకునేలా వేచిచూసే ధోరణిని భారత్ కంపెనీలు ప్రదర్శిస్తున్నాయని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా ఎండి సందీప్ గులాటీ తెలిపారు.
భారత్‌లో ఆశావహ దృక్పథం నెలకొందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ పలు రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగార్థుల ఆశలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
మైనింగ్, నిర్మాణ, బీమా, రియల్ ఎస్టేట్ రంగాల్లో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని, అలాగే మధ్యతరహా సంస్ధల్లో నియామకాలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. ఆ తర్వాత భారీ, చిన్న తరహా సంస్ధలు నియామకాలకు మొగ్గుచూపుతాయని, లాక్‌డౌన్ సమయంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుందని ఆయన తెలిపారు.
More Stories
ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా ఇంట్లో ఈడీ సోదాలు
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం