కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మనోజ్ మృతి

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మనోజ్ మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్‌ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్‌ (33) మృతి చెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

హైదరాబాద్‌ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మనోజ్‌కుమార్‌ చికిత్స కోసం ఫీవర్‌ హాస్పిటల్‌కు వెళ్లారు.

పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల సమస్యలతోపాటు కరోనా లక్షణాలు కనిపించటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం గాంధీ దవాఖానకు తరలించారు. మనోజ్‌కుమార్‌కు కండరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నదని, ఇందుకోసం శస్త్రచికిత్స చేసి గ్రంథిని తొలగించామని గాంధీ  వైద్యాధికారులు చెప్పారు. 

ఊపిరితిత్తులతోపాటు కరోనాకు చికిత్సపొందుతుండగా, గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు వెల్లడించారు. ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోవటం కష్టమైందని చెప్పారు. శవపరీక్ష  అనంతరం సైదాబాద్‌లో మనోజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అతడి సోదరుడికి కూడా  పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌లో ఉన్నాడు.

మనోజ్‌ మృతి తీవ్రంగా కలచి వేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో మీడియా రెపోరేటర్లు అందరికి ప్రభుత్వమే ఆరోగ్య రక్షణ కల్పించాలని కోరారు. మీడియా మిత్రులు అందరికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్టులు జరిపి వారిని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

కరోనాతో జర్నలిస్టు మనోజ్‌కుమార్‌ మృతిచెందడంపై మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జర్నలిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

మనోజ్‌ కుటుంబానికి రాష్ట్ర సమాచార కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి రూ.25 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.  సినీనటుడు పోసాని కృష్ణమురళి మనోజ్‌ కుటుంబానికి రూ.25 వేల సాయం ప్రకటించారు. సినిమా షూటింగ్‌లు మొదల య్యాక మరో రూ.25 వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మనోజ్‌ మృతికి జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి.