తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 11 నుండి సాధారణ భక్తులను అనుమతిస్తామని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జూన్ 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులతో శ్రీవారి దర్శనాల ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వైవీ స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకుని భక్తులు రావాలని, తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వీఐపీ దర్శనానికి కేవలం గంట మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్ల మార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించబోమని తెలిపారు. పుష్కరిణిలోకి భక్తులను అనుమతించమని స్పష్టం చేశారు.
రోజుకి 7వేల మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శనం కల్పించడానికి అవకాశముందని పేర్కొన్నారు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. అంతేకాదు స్వామి వారి దర్శానికి వచ్చే భక్తులు ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని చెప్పారు. మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరిగావాడాలని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గదులు కేటాయిస్తామని పేర్కొన్నారు. సరి, బేసి పద్దతిలో గదుల కేటాయింపు ఉంటుందని, ఒక్కో రూమ్‌లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు.
క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇస్తామన్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తామన్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపారు.
తిరుమలలో ప్రధానంగా నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి హుండీ, కళ్యాణ కట్ట, అన్నప్రసాద కేంద్రం, తీర్ధం చఠారీ దగ్గర సమస్యలున్నాయని తెలిపారు. కళ్యాణకట్టలో తలనీలాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పారు.
అన్నప్రసాద కేంద్రం దగ్గర చేతులు శుభ్రపరుచుకోనే ప్రాంతంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీర్థం చఠారీ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్ల లోని భక్తులను ఎట్టి పరిస్థితుల్లోఅనుమతించబోమని స్పష్టం చేశారు.
More Stories
తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తాం
ఒకేరోజు 13,326 గ్రామసభలతో ఏపీ ప్రపంచ రికార్డు