
ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు హంపి, జంషెడ్ పూర్ లలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు నగరంలోని శర్మ కళాశాల, అంబేడ్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
కొందరు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, ఝార్ఖండ్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.
ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు.
హంపిలో చాలా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ పురాతన నగరంలో ఏడవ శతాబ్ధానికి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. యునెస్కో ఈ నగరాన్ని వారసత్వ సంపదకు చిహ్నంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం కూడా పలు చోట్ల ప్రకంపనలు వచ్చినట్లు సెసిమాలజీ అధికారులు వెల్లడించారు. హర్యానాలోని రోహతక్‌లో 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. గత నెల రోజుల నుంచి ఢిల్లీ ప్రాంతంలో స్వల్ప స్థాయి ప్రకంపనలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు.
More Stories
శారదా పీఠం భవనం స్వాధీనంకు టిటిడి నోటీసు
అన్యమత ప్రిన్సిపాల్ పై టిటిడి వేటు!
విశాఖ మేయర్‌పై నెగ్గిన కూటమి అవిశ్వాస తీర్మానం