
తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను ఢిల్లీ క్రైంబ్రాంచ్ సీజ్ చేశారు. ముఫ్తి షాజాద్, జిషాన్, ముర్సాలిన్ సైఫీ, మహ్మద్ సల్మాన్, యూనస్‌లు దేశం విడిచి వీల్లేకుండా కట్టడి చేశారు.
అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 916 మంది విదేశీయులపై త్వరలోనే చార్జిషీట్ నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. వీరంతా టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో 67 దేశాల నుంచి వచ్చిన విదేశీయుల వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టామని.. వీరందరినీ వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లలో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీల ద్వారా అనేక ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్ మౌలానాపై కేసు నమోదు చేశారు. అదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు వచ్చినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలడం సంచలనం సృష్టించింది.
దీంతో మౌలానాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన ముర్సాలిన్ సైఫీని ఈడీ అధికారులు విచారించగా తాజాగా అతనితో పాటు మరో నలుగురి పాస్‌పోర్టులను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.
More Stories
ఇక ఆన్లైన్లోనే సినిమాలకు సీబీఎఫ్సీ సర్టిఫికేట్
పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల రక్షణ సామగ్రి