విద్యుత్ చార్జీలపెంపుపై ఏపీ బీజేపీ నిరసన

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ బిజెపి నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఇళ్లలోనే నిరసనలు పాటించారు. 

గుంటూరు లో నిరసనదీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ శ్లాబ్‌లు మార్చారని… ప్రజలంతా లాక్‌డౌన్‌తో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 

ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.  వినియోగదారుల ఏడాది వినియోగం ఆధారంగా గతంలో ఏబీసీ గ్రూపులుగా విభజించారని తెలిపారు. మధ్య తరగతి ప్రజలు కూడా 225 యూనిట్లుపైగా  వినియోగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తాము విద్యుత్ బిల్లులు పెంచలేదని ప్రభుత్వం చాలా తెలివిగా చెబుతోందని, కానీ శ్లాబ్ మార్పు కారణంగా పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా గ్రూపు సిలోకి మారిపోయారని స్పష్టం చేశారు. 

దీంతో గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగాయని కన్నా పేర్కొన్నారు. తాను కూడా మార్చి నెలలో  రూ 11,541 చెల్లించగా, ఈ నెలలో ఆ బిల్లు రూ  20 వేలు బిల్లు దాటిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాత్రం బిల్లులు పెంచలేదని ఎలా చెబుతుందని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అన్ని ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. 

ఇప్పుడు  ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారని కన్నా విమర్శించారు. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని ఏపీ బిల్డ్ కోసం అమ్మకానికి పెట్టడం దారుణమని దుయ్యబట్టారు. వందలాది మంది మార్కెట్‌పై ఆధారపడి ఉన్నారని చెబుతూ, తమకు పరిపాలన చేతగాక పోతే దిగిపోండని హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వృద్ధురాలిపై కేసు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంతమందిని అరెస్టు చేస్తారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.