నిండు చూలాలైన ఒక మహిళ రైలు ప్రయాణంలో ఉండగానే తీవ్రమైన నొప్పులు రావడంతో రైలును సమీపంలోని స్టేషన్‌లో ఆపారు. తక్షణ వైద్య సాయం అందకపోతే తల్లీబిడ్డలకు ప్రమాదకర పరిస్థితి. యాదృచ్ఛికంగా హైదరాబాద్ రైలు కోసం వేచి ఉన్న ఆర్మీ మెడికల్ ఆఫీసర్ మేజర్ రోహిత్ (31) తక్షణ సాయానికి ముందుకొచ్చారు. తనకు అందుబాటులో ఉన్న చిన్నచిన్న పరికరాలతో వైద్యం చేయడంతో ఆ గర్భిణికి సుఖప్రసవమైంది.
ఆ వెంటనే ఆసుపత్రికి తరలించగా, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. శనివారం మధ్యాహ్నం ఝాన్సీ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్ సెంట్రల్ రైల్వే ఝాన్సీ డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మనోజ్ కుమార్ సింఘ్ ఆ వివరాలను అందించగా, సోషల్ మీడియాలో పలువురు ఆ యువ వైద్యుడిని అభినందిస్తున్నారు. ఆయన ఝాన్షి ఆర్మీ హాస్పిటల్ లో వైద్యునిగా పనిచేస్తూ హైదరాబాద్ వెళ్లేందుకు స్టేషన్ కు వచ్చారు.
హైదరాబాదీ అయిన ఆర్మీ డాక్టర్ రోహిత్ బచ్‌వాలాను ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మెచ్చుకున్నారు. రోహిత్ బచ్‌వాలా వృత్తికి సంబంధించి సమయస్ఫూర్తిని ప్రదర్శించారని, విధి నిర్వహణపట్ల తనకున్న నిస్వార్ధమైన నిబద్ధతను చాటుకున్నారని ఆయన కొనియాడారు. సమయానికి స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు నిలబెట్టిన ఆర్మీ డాక్టర్‌పై రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
పాన్వెల్- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణకి నొప్పులు తీవ్రం కావడంతో ఝాన్సీ స్టేషన్‌లో ఆమెను కిందకు దించారు. పరిస్థితి గమినించిన ఒక మహిళా టిక్కెట్ స్టాఫ్ మెంబర్, మరొక ఆర్మీ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. వీల్ చైర్‌లో ఆమెను తరలించే ప్రయత్నం చేస్తుండగా, మరో రైలు కోసం వేచి చూస్తున్న ఆర్మీ మెడికల్ కార్ప్స్ మెడికల్ అధికారి మేజర్ డాక్టర్ రోహిత్ బచ్‌వాలా (31) అక్కడకు చేరుకున్నారు.
సమయం లేకపోవడం, పరిస్థితి తీవ్రత గుర్తించిన ఆయన వెంటనే రైల్వే స్టేషన్‌లోనే డెలివరీకి నిర్ణయం తీసుకున్నారు. సరైన ఆపరేషన్ థియేటర్ లేనప్పటికీ అందుబాటులో ఉన్న పరికరాలతో వైద్యం మొదలుపెట్టారు. దీంతో గర్భిణికి సుఖప్రసవమైంది. వెంటనే హెయిర్ క్లిప్‌తో బొడ్డు పేగును బిగించి, దానికి కత్తిరించేందుకు పాకెట్ నైఫ్‌ను ఉపయోగించారు. వెంటనే తల్లీబిడ్డను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి చేర్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు.
”సమయం మించిపోతే తల్లీబిడ్డకు అపాయం అని గుర్తించి ఆ ఏరియాను మేక్‌షిప్ట్ డెలివరీ ప్రాతంగా చేసి అందుబాటులో ఉన్న పరికరాలతో వైద్యం అందించాను. భగవంతుడి దయ వల్లే ఆ సమయంలో నేను అక్కడ ఉన్నాను. వైద్యులుగా మేము ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా వైద్యసాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలి. రెండు జీవితాలను కాపాడేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు” అని మేజర్ బచ్‌వాలా చెప్పారు. ఎమర్జెన్సీ కేసును విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఆయన యథాప్రకారం హైదరాబాద్ కు రైలులో తన ప్రయాణం కొనసాగించారు.
More Stories
2021లో బెంగాల్ లో హిందూ మహిళలపై భయంకర దాడులు మరవకండి
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!