
అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ 21న విశాఖపట్టణంలో జరిగే యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంకు ఏపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఐదుగురు మంత్రులతో ఓ నిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హోమ్, ఆరోగ్య, టూరిజం, సాంఘిక సంక్షేమ, మానవ వనరుల శాఖ మంత్రులుంటారు.
కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టి కృష్ణ బాబు వ్యవహరిస్తారు. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ కార్యక్రమ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. “ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ ‘యోగా ఫర్ వన్ ఎర్త్… వన్ హెల్త్’. యోగా డే నాడు నిర్వహించే కార్యక్రమం రాష్ట్రంలో యోగ అభ్యాసానికి నాంది పలకాలి. కనీసం రెండు కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి. ‘యోగాంధ్ర-2025’ థీమ్‌తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలి. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ‘యోగా మంత్’ పాటించాలి” అని చెప్పారు.
నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వాలని, రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని ఆయన సూచించారు. “ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని అధికారులు తెలిపారు.
యోగా చేసేందుకు 68 ప్రాంతాలు గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో 2,58,948 మంది యోగ సాధనకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. సీఎం ‘ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు… బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించండి. ఐదు లక్షల మందితో కార్యక్రమాన్ని నిర్వహించండి’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు