ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరిన లోకేష్

ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఆశీస్సులు కోరిన లోకేష్
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఆశీస్సులు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ తన వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా విన్నవించారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను సాధించేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. 
 
భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌లతో కలిసి మంత్రి లోకేశ్‌ ప్రధానిని శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో ఢిల్లీలోని మోదీ నివాసానికి వెళ్లిన లోకేశ్‌ కుటుంబం దాదాపు 2 గంటలు ప్రధానితో గడిపింది. మోదీకి లోకేశ్‌ శాలువా కప్పి, తిరుమల శ్రీవారి విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘యువగళం’ కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. లోకేశ్‌ నుంచి మొదటి ప్రతిని అందుకున్నారు. మరో పుస్తకంపై మోదీ సంతకం చేసి లోకేశ్‌కు అందించారు. 
 
2024 ఎన్నికలకు ముందు లోకేశ్‌ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్‌ బుక్‌లో పొందుపరిచారు. తన నివాసంలో బ్రాహ్మణి, దేవాన్ష్‌లకు ప్రధాని మోదీ ఆశీస్సులు అందించారు. దేవాన్ష్‌ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేశారు. దేవాన్ష్‌కు చదరంగంలో ఉన్న ప్రావీణ్యాన్ని తెలుసుకునిప్రధాని  అభినందించారు. ఈ సందర్భంగా మోదీ చాక్లెట్లను అందజేశారు.
రాష్ట్ర పురోగతి కోసం అమరావతి, పోలవరానికి నిధులు అందించడంతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఆర్థిక మద్దతు అందించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉన్నందుకు ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ భద్రత, దేశాభివృద్థిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వాన్ని ప్రశంసించారు.
 
2047 నాటికి వికసిత్ భారత్ కోసం మోదీ మార్గదర్శకత్వంలో తామందరం పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని లోకేష్ తెలిపారు. మోదీ దార్శనికత ఏపీ పురోగమనానికి ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివ్రద్ధి సాధిస్తోందని పేర్కొంటూ అందులో ఏపీ భాగస్వామ్యం అయిందని సంతోషం వ్యక్తం చేశారు.
 
ఇటీవల అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వచ్చిన మోదీ కుటుంబంతో కలసి ఢిల్లీకి రావాల్సిందిగా లోకేశ్‌ను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు లోకేశ్‌ తన కుటుంబంతో వెళ్లారు. ప్రధాని మోదీతో భేటీపై నారా బ్రాహ్మణి ‘ఎక్స్‌’లో సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌ను గ్లోబల్‌ పవర్‌గా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని, ఆయన ఒక గొప్ప ప్రధానమంత్రి అని ప్రశంసించారు.