
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శుక్రవారం విజయవాడలో తిరంగా ర్యాలీని నిర్వహించింది. ఆపరేషన్ సింధూర విజయోత్సవం సందర్భంగా భారత సైనికులకు సంఘీభావంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బందర్ రోడ్డులోని బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ ర్యాలీలో వేల సంఖ్యలో ప్రజలు హాజరవ్వడంతో బందర్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమం సందర్భంగా నగరంలో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ను మళ్ళించారు. భారతమాత కీర్తి పతకాన్ని చాటుతూ తిరంగా ర్యాలీ చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తీవ్రవాదం రూపంలో ఎవరూ దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరిరోజని హెచ్చరించారు. జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత రక్షణ దళాలకు సీఎం చంద్రబాబు సెల్యూట్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పాకిస్తాన్ వల్ల ఎప్పుడు ప్రశాంతత చూడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్థాన్ చూసి ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతోందని తెలిపారు. దేశం కోసం పోరాడిన మురళీనాయక్ లాంటి సైనికులు దేశానికి నిజమైన నాయకులని పవన్ చెప్పుకొచ్చారు.
సెలబ్రిటీస్ నుంచి దేశభక్తి ఆశించవద్దని పేర్కొంటూ సినిమా హీరోలంతా దేశాన్ని నడిపేవారు కాదని చెప్పారు. వాళ్లంతా ఎంటర్‌టైన్ చేసేవాళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. శాంతి వచనాలు ఇక పని చేయవని, పాకిస్థాన్ వాళ్లు భారత్‌లోకి వచ్చి కొడితే వాళ్ల సరిహద్దు దాటి వారి ఇళ్లల్లోకి వెళ్లి మనం కొడతామని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు తిరంగా యాత్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. 2014 సంవత్సరం నుంచి సమర్ధవంతమైన నాయకత్వం దేశానికి లభించిందని గుర్తుచేశారు. దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల మన వాళ్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనలో పాకిస్థాన్‌కు జవాబు దీటుగా ఇచ్చామని పురందేశ్వరి ఉద్ఘాటించారు.
More Stories
కాంగ్రెస్, ఆర్జేడీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్యం
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
భారత్ `విశ్వగురువు’గా మారడమే ప్రపంచ శాంతికి మార్గం