
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపిన సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పర్యావరణ నష్టం పూడ్చకపోతే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిందేనని, పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా? స్పష్టం చేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదేశించారు.
లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ధర్మాసనం ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలు స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై విచారణను జులై 23వ తేదీకి వాయిదా వేసింది.
హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు విచారణ జరిపింది. హెచ్‌సీయూలో విధ్వంసానికి సంబంధించిన వివరాలన్నింటిని పరిశీలించడానికి ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంవపర్డ్ కమిటీ హెచ్‌సీయూ విధ్వంసాన్ని పరిశీలించింది.
అక్కడి విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల ఒపీనియన్స్ సైతం సేకరించింది. కాగా, అక్కడ జరిగింది విధ్వంసమే.. చెట్లు, జంతువులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికను ఏప్రిల్ 15న కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. అదే రోజు ప్రభుత్వం సైతం నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది.
ఇదే సమయంలో మే 15 వరకు మీరు హెచ్‌సీయూ అడవుల్లో కూల్చిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. గతంలో విచారణ సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని.. అలా ఇవ్వకపోతే సీఎస్‌ను జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించిన విషయం విధితమే. చెట్లను నాటడానికి ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తారో చెప్పాలంటూ సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, సీఎస్‌ను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హెచ్చరించింది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి