హైదరాబాద్ లో అందుబాటులోకి మరో రెండు రైల్వే స్టేషన్లు

హైదరాబాద్ లో అందుబాటులోకి మరో రెండు రైల్వే స్టేషన్లు
హైదరాబాద్ నగరంలో అనేక రైల్వే స్టేషన్లు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. ఇవి నగరానికి, ఇతర ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని అందిచేందుకు దోహదపడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి స్టేషన్, కాచిగూడ స్టేషన్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లు కాగా, ఇటీవల చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
రూ. 450 కోట్లకు పైగా వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచే అనేక ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కాకుండా లింగంపల్లి, బేగంపేట, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. తాజాగా నగరంలో మరో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.  త్వరలోనే చర్లపల్లి- మౌలాలి-బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన ఆర్కే నగర్, దయానంద నగర్ రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దయానంద్ నగర్, ఆర్కే నగర్ లలో పలు అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ పలు విభాగాల అధికారులతో కలిసి ఈ రెండు స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఈ రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్కే నగర్లో కృష్ణా ఎక్స్ప్రెస్ను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు 21 కోచ్లకు సరిపడా ప్లాట్ఫామ్ను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఈ రైలుతో పాటు ఆదిలాబాద్-తిరుపతి, విశాఖపట్నం- నాందేడ్, నర్సాపూర్-నాగర్సోల్, విశాఖపట్నం-షిర్డీ సాయినగర్, అలాగే నాగావళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలంటూ ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే శాతవాహన ఎక్స్ప్రెస్ను కాచిగూడకు మళ్లించగా, మల్కాజిగిరి స్టేషన్ వద్ద ఆపితే ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉంటుందని సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
వీటితో పాటు చర్లపల్లి నుంచి మేడ్చల్, చర్లపల్లి నుంచి ఉందానగర్, చర్లపల్లి నుంచి హైదరాబాద్, చర్లపల్లి నుంచి లింగంపల్లి వయా మల్కాజిగిరి, రద్దీ సమయాల్లో చర్లపల్లి నుంచి లింగంపల్లికి 2 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి వస్తుంది. మల్కాజిగిరి పశ్చిమం నుంచి చర్లపల్లికి బస్సు సర్వీసులు పెంచాలని ఆర్టీసీ అధికారులను ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ సైతం విజ్ఞప్తి చేసింది.