హైదరాబాద్ మెట్రో చార్జీలు 30 శాతం పెరిగే అవకాశం

హైదరాబాద్ మెట్రో చార్జీలు 30 శాతం పెరిగే అవకాశం
హైదరాబాద్‌ నగర రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలు టికెట్‌ చార్జీల పెంపు దాదాపుగా ఖరారైంది. ఛార్జీల పెంపుపై కొంతకాలంగా ఊగిసలాడుతున్న ఎల్‌ అండ్‌ టీ అధికారులు నష్టాలను నివారించుకునేందుకు 30 శాతం వరకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.  ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠ టికెట్ ధర రూ.10, ఉండగా గరిష్ఠ టికెట్ ధర రూ.60 గా ఉంది. కనిష్ట ధర రూ 15కు, గరిష్ఠ ధర రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది.

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఛార్జీల నిర్ణయ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్‌ రేట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమై ఆయన అనుమతి కోరనున్నారు. ఈ అంశం ఇప్పటికే సీఎం దృష్టిలో ఉండడంతో ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నారు.

ఇదే సమయంలో పెంచనున్న చార్జీలను ఈ నెల 10 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
హైదరాబాద్‌లో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో 2012లో రూ.14,132కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి 2017 నవంబరులో పూర్తిచేశారు.  ప్రస్తుతం రోజుకు 1,200సర్వీసులు నడుస్తుండగా 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 5.10లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 
కరోనా లాక్‌ డౌన్‌ సంస్థను మరింత నష్టపరిచిందని దీంతోనే మొత్తం అప్పులు రూ .6500 కోట్లకు చేరిందని ఎల్‌ అండ్‌ టీ ప్రకటించింది. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు చార్జీల పెంపుతో సర్దుబాటు చేసుకోవాలని భావిస్తోంది. కరోనాకు ముందు రోజుకు రూ.80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్చుకున్న సంస్థ తర్వాత నుంచి కుదేలైంది. 2020 నుంచి 2022 వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పాటు మాల్స్‌, ప్రకటనల నుంచి ఆశించిన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కింద ప్రభుత్వం ఇచ్చిన 267 ఎకరాల భూమిలో కేవలం నాలుగైదు ప్రాంతాల్లోనే కమర్షియల్‌ కాంప్లెక్సులు నిర్మించింది.
67 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 18 మిలియన్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులో ఉంది. ఏడున్నర సంవత్సరాలుగా 8 మిలియన్ల స్పేస్‌ మాత్రమే వినియోగంలోకి వచ్చింది. ఈ క్రమంలో కమర్షియల్‌ స్పేస్‌ ను మార్కెట్లోకి తీసుకువచ్చేలా ఎల్‌ అండ్‌ టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక కార్యాచరణ రూపొందించలేదు. 
ఇప్పటికే రూ.59తో ఉన్న హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది.
 
ప్రస్తుతం మెట్రో ఆపరేషన్స్, మాల్స్‌అద్దెలు, ప్రకటనల ద్వారా ఏటా రూ. 1500 కోట్ల వరకు ఆదాయం మెట్రోకు సమకూరుతోంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుండడంతో ఆ భారం కూడా మెట్రోపై పడిందని ఎల్‌ అండ్‌ టీ అధికారులు చెబుతూ వస్తున్నారు.