అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విదేశి దిగుమతులపై సుంకాలను పెంచి షాకిచ్చారు. దాంతోపాటు చదువు కోసం వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీ విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపుతున్నారు. తాజాగా ట్రంప్ హాలీవుడ్ పై దృష్టి సారించారు. కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందని ట్రంప్ పేర్కొన్నారు.
స్టూడియోల ప్రొడక్షన్ ను విదేశాలకు మార్చడానికి అమెరికన్ చిత్రనిర్మాతలను ఇతర దేశాలు ప్రలోభపెడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇకనుంచి విదేశాల్లో చిత్రీకరించే సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆదివారం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ పోస్ట్ చేస్తూ అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
అమెరికాలోని చలనచిత్ర పరిశ్రమ చాలా వేగంగా నాశనమవుతుందని మండిపడ్డారు. మన చిత్ర నిర్మాతలు, స్టూడియోలను అమెరికా నుండి దూరం చేయడానికి ఇతర దేశాలు అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. హాలీవుడ్, అమెరికాలోని అనేక ఇతర సినీ ప్రాంతాలు నాశనమవుతున్నాయని, ఇది ఇతర దేశాల సమిష్టి ప్రయత్నమని, జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
అందుకే, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియను ప్రారంభించడానికి వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్‌టిఆర్)కు అధికారం ఇచ్చానని ట్రంప్ ప్రకటించారు. అయితే, విదేశాల్లో నిర్మించే అమెరికా సినిమాలపై ఈ సుంకాలు విధిస్తారా? లేక, అమెరికాలో విడుదల చేసే విదేశీ చిత్రాలపై ఈ టారిఫ్ లు విధిస్తారా? అనే దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఈ నిర్ణయం ద్వారా దేశీయ చలనచిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించడం, హాలీవుడ్‌ను బలోపేతం చేయడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.
“అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా నష్టపోతుంది. మా దర్శక, నిర్మాతలు, స్టూడియోలను ఆకర్షించేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో హాలీవుడ్ ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయి. ఇతర దేశాలు చేస్తున్న సమష్టి కుట్ర ఇది. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నాం. అందువల్ల, విదేశీ గడ్డపై నిర్మించి మన దేశంలోకి వచ్చే సినిమాలపై 100శాతం సుంకం విధించా. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు అధికారాలు ఇస్తున్నా'” అని ట్రంప్ ట్రూత్‌లో రాసుకొచ్చారు. దీనిపై తాము పని చేస్తున్నామని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ స్పందించారు.
ఈ ప్రకటన అమెరికా చలనచిత్ర పరిశ్రమలో పెద్ద చర్చను రేకెత్తించింది. ఓ వైపు సుంకం విదేశీ చలనచిత్రాల ధరలను పెంచి, అమెరికా మార్కెట్‌లో వాటి పోటీ తత్వాన్ని తగ్గిస్తుందని అంటున్నారు అక్కడి వర్గాలు. దీనివల్ల స్థానిక నిర్మాతలు, స్టూడియోలు ప్రయోజనం పొందవచ్చు. కానీ అంతర్జాతీయ సినిమాలకు ఈ సుంకం వల్ల టికెట్ ధరలు పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమెరికా స్టూడియోలు విదేశాల్లో తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం కోల్పోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

More Stories
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
హైకోర్టు తీర్పుతో భోజ్‌శాల సముదాయంలో విశేషంగా పూజలు!
భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్