
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.
మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్ విఫలమైందంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు.
30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ పిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇది దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ విశాల్ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్