
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి భవన్ ఖండించింది. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు అత్యున్నతమైన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ అంశంపై బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని మీడియా పలకరించింది.
ఆ సమయంలో ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి ముర్ము బాగా అలసిపోయారని, అతి కష్టం మీద మాట్లాడినట్టు కనిపించారని సోనియా వ్యాఖ్యానించారు. . ‘రాష్ట్రపతి చాలా పేలవంగా ఉంది. ప్రసంగంలో తప్పుడు వాగ్ధానాలే ఉన్నాయి. ఆమె చివరి వరకు మాట్లాడలేక అలసిపోయారు’ అని ఆమె చెప్పారు.
ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. తన తల్లి మాటలను రాహుల్ సమర్థించారు. బోరింగ్ నో కామెంట్స్? రాష్ట్రపతి చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పారు? అని తెలిపారు. సోనియా గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతి ముర్మును ఉద్దేశించి చులకన అనే పదాన్ని సోనియాగాంధీ ప్రయోగించడాన్ని తాను, ప్రతీ బీజేపీ కార్యకర్త బలంగా ఖండిస్తారని ఆయన తెలిపారు.
“కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన పేదల వ్యతిరేక, గిరిజన వ్యతిరేక భావజాలం బయటపడింది. ఈ అంశంపై కాంగ్రెస్ బేషరతుగా రాష్ట్రపతికి, దేశంలోని గిరిజన వర్గానికి క్షమాపణలు చెప్పాలి” అని జేపీ నడ్డా డిమాండ్ చేశారు.
సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు రాష్ట్రపతి ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. “ద్రౌపది ముర్ము మన దేశ రాష్ట్రపతి, ఆమె ఓ గిరిజన వనిత. ఇక్కడ బలహీనమైన అంశమేం ఉంది? ద్రౌపది ముర్ము దేశం కోసం ఎంతో సేవ చేశారు. సామాజిక సేవకు ఆమె జీవితాన్ని అర్పించారు. ముర్ము మన దేశం కోసం చేసిన సేవను విపక్ష నేతలు కనీసం ఊహించనూ లేరు. వాళ్లు తప్పకుండా ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు.
వారు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ విమర్శించారు. ‘సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు రాష్ట్రపతిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ద్రౌపది ముర్ము ఆదివాసీ కుటుంబానికి చెందినవారు. ఇప్పుడు ఆమె మన దేశంలో నంబర్ వన్ పౌరురాలు. కాంగ్రెస్ జమీందారీ మనస్తత్వం దానిని అంగీకరించదు. అందుకే వారు ఆమె ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
సోనియాగాంధీ వ్యాఖ్యలతో ఆమె జమీందారీ మనస్తత్వం మరోసారి బయటపడిందని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వీయ విమర్శించారు. రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నవారిని ఉద్దేశించి చులకన వంటి పదాలను ప్రయోగించడం సరికాదని ఆయన హితవు చెప్పా రు. రాష్ట్రపతి కార్యాలయాన్ని అగౌరవపరిచేలా సోనియాగాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
గతంలోనూ కాంగ్రెస్ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అమిత్ మాల్వియ ఆరోపించారు. తొలిసారిగా ఒక గిరిజన మహిళ దేశ అత్యున్నత హోదాలో ఉండటాన్ని చూసి ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. “నిత్యం చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాష్ట్రపతిని గౌరవపూర్వకంగా కలవలేదు. నిజానికి వాళ్లకు రాజ్యాంగంపై గౌరవం లేదు. దళితులు, ఓబీసీలు, గిరిజనులంటే కాంగ్రెస్‌కు పట్టదు” అని అమిత్ మాల్వియ మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. “నా తల్లి 70-80 ఏళ్ల వయసు ఉన్న మహిళ. రాష్ట్రపతి అంత సుదీర్ఘమైన ప్రసంగాన్ని చదివారు. ఆమె అలసిపోయి ఉంటారు. సోనియా ఎప్పుడూ రాష్ట్రపతిని గౌరవిస్తారు. ఆ విషయాన్ని మీడియా వక్రీకరించడం చాలా దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. బీజేపీ మొదట క్షమాపణ చెప్పాలి” అని ప్రియాంక డిమాండ్ చేశారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం