
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే – 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సర్వే ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3-6.8 శాతం రేంజ్‌లో ఉంటుందని అంచనా వేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వినియోగం స్థిరంగానే ఉండొచ్చని, తద్వారా ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేసినట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి.
రూరల్ డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైందని.. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 7 శాతం కంటే తక్కువ అని ఆర్థిక సర్వేలో ఉంది. ఇదే విధంగా ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు కేంద్ర బ్యాంకు అంచనాల్ని అందుకోలేదని తెలిపింది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 6.3-6.8 శాతంగా ఉండొచ్చని అంచనా.
- దేశ ఆర్థిక పరిస్థితులు వచ్చే ఏడాది మందకొడిగా ఉంటాయి.
- తయారీ రంగం నెమ్మదించడం సహా కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత వృద్ధి రేటు 6.40 శాతంగా ఉంది. గడిచిన నాలుగేళ్లలో చూస్తే ఇదే అత్యల్పం. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 8.20 శాతం, 7.20 శాతం, 8.70 శాతంగా ఉంది.
- గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఐపీఓ లిస్టింగుల్లో మన వాటానే 30 శాతంగా ఉంది.
- ప్రభుత్వ మూలధనం పెరగడం సహా వ్యాపార అంచనాలు మెరుగుపడటంతో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు.
తొలుత పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్.. ఆర్థిక సర్వేను సభ ముందుకు తీసుకొచ్చారు. అనంతరం సభను శనివారానికి (ఫిబ్రవరి 1) వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. శనివారం రోజు ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
చివరిసారిగా గతేడాది జులై 23న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, దానికి ముందు రోజు జులై 22న ఆర్థిక సర్వే 2024-25ను నిర్మలమ్మ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక సర్వే అంటే దేశ ఆర్థిక స్థితికి అద్దం పట్టే అధికారిక వార్షిక నివేదిక. దీనిని దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా పేర్కొంటారు. దీని ఆధారంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతుంటుంది.
ఏటా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1కి ముందురోజు అంటే జనవరి 31న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టును పార్లమెంటుకు సమర్పిస్తుంది. కిందటి ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థలో జరిగిన ప్రధాన మార్పులు, పరిణామాల్ని చెప్పి.. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తుంది. వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థ పనితీరు సహా సేవా రంగాల అభివృద్ధి, తదుపరి సంవత్సరంలో చేపట్టాల్సిన విధానాలు, సంస్కరణలు వంటి వివరాలు ఉంటాయి.
ఆర్థిక సర్వేలో ప్రస్తుత ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి విశ్లేషిస్తారు. ఆర్థిక బలోపేతానికి రానున్న రోజుల్లో చేయాల్సిన చర్యల్ని పేర్కొంటారు. అయితే కేంద్ర బడ్జెట్ విషయానికి వస్తే.. పలు రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపుల గురించి పేర్కొంటారు. ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు నేతృత్వంలో రూపొందిస్తారు.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!