రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్‌ ఫొగాట్‌

ప్రముఖ ఇండియన్ రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ తన రిటైర్​మెంట్​ను వెనక్కు తీసుకుంటున్నానని, 2028 ఒలింపిక్స్​లో మెడల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్​లో నిర్దేశిత వెయిట్ కంటే 100 గ్రాములు​ ఎక్కువ ఉండడంతో వినేశ్ ఫొగాట్ (31 ఏళ్లు)​ను అనర్హులిగా ప్రకటించి, ఫైనల్​లో ఆడనివ్వలేదు. రన్నరప్ పతకం కూడా ఇవ్వలేదు.

దీనితో ఆమె బరువైన హృదయంతో రెజ్లింగ్​కు రిటైర్మెంట్ ప్రకటించారు. వాస్తవానికి ఒలింపిక్స్ రైజ్లింగ్ ఫైనల్​కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్ ఘనత సాధించారు. కానీ ఆమె ఒలింపిక్స్ మెడల్ కల పారిస్ ఒలింపిక్స్​లో చెదిరిపోయాయి. ఈ నేపథ్యంలో దాదాపు 18 నెలల తర్వాత ఆమె ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్​ పోస్టు పెట్టారు. తన రెజ్లింగ్​ కెరీర్​ను తిరిగి ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

“ప్యారిస్‌ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్‌ జర్నీ ముగిసిందా అని ప్రజలు ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్‌ మ్యాట్‌, ఆ ఒత్తిడి, అంచనాల నుంచి, నా సొంత ఆశయాలకు కూడా కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇన్నేళ్లలో మొదటిసారిగా నేను కాస్త ఊపిరిపీల్చుకోగలిగాను” అని తెలిపారు. 

“నా సుదీర్ఘ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను అర్థం చేసుకోవడానికి నేను కొంత సమయం తీసుకున్నాను. నేను కెరీర్​లో ఎన్నో ఎత్తులు చూశాను. అందులో ఈ ప్రపంచం ఎన్నడూ చూడని హృదయ విదారకర ఘటనలు, త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఓ సత్యాన్ని తెలుసుకున్నాను. నేను ఇప్పటికీ ఈ క్రీడను  ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగాలని అనుకుంటున్నాను” అని ఆమె ప్రకటించారు. 

“ఈ సారి నేను ఒంటరిగా బరిలోకి దిగట్లేదు. నా వెంట నా కొడుకు వస్తున్నాడు. నన్ను ప్రోత్సహించేందుకు నా కొడుకు సిద్ధమయ్యాడు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో కలుద్దాం” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.  వినేశ్ ఫొగాట్ గతేడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజక వర్గం నుంచి పోటీ చేసి 6,000 ఓట్ల తేడాతో గెలిచారు. దీనితో ఆమె ఓ వైపు రాజకీయ జీవితం గడుపుతూనే, మరోవైపు రెజ్లింగ్​పై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది.