
కాగా, భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్లు మరణించారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న రైతుపై సమీపంలోని హిల్‌టాప్ పొజిషన్ నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైతు గాయపడ్డాడు.
వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. కొద్దిసేపు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. గాయపడిన రైతును సమీపంలోని పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
కొండ ప్రాంతాల నుంచి రైతులపై మిలిటెంట్లు కాల్పులు జరపడం వరుసగా ఇది మూడోరోజు. గత శనివారంనాడు బిష్ణుపూర్ జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఒక మహిళపై మిలిటెంట్లు చురాచాంద్‌పూర్ జిల్లా కొండ ప్రాంతాల నుంచి కాల్పులు జరపడంపై ఆమె మరణించింది. ఆదివారంనాడు కూడా ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని సనసబి, సబున్కోక్ ఖునౌ, తంనపోక్పిలో ఇదే తరహా దాడులు జరిగాయి.
మరోవైపు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న నిరాశ్రయుల శిబిరం కుకీ మిలిటెంట్ల లక్ష్యం కావచ్చని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. జిరిబామ్ జిల్లాలోని ఈ పోలీస్ స్టేషన్‌ను కుకీ మిలిటెంట్లు పలుసార్లు టార్గెట్ చేసినట్లు పేర్కొన్నారు.
మరోవంక, మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రయత్నిస్తున్నారని, కుకీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతున్నారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే ఇది పచ్చి అబద్ధమని 10 మంది కుకీ-జో ఎమ్మెల్యేలు ఆరోపించారు. సుప్రీంకోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
మైతీ, కుకీల మధ్య జాతి ఘర్షణ మొదలైన 2023 మే నాటి నుంచి సీఎం బీరెన్ సింగ్ తమతో ఎప్పుడూ సమావేశం కాలేదని కుకీ-జో ఎమ్మెల్యేలు తెలిపారు. మణిపూర్‌లో హింస కొనసాగడానికి, తమ జాతుల ప్రక్షాళనకు సూత్రధారి అయిన సీఎంను భవిష్యత్తులో కూడా కలిసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పది మంది కుకీ ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మణిపూర్‌లో మైతీ, కుకీ జాతుల మధ్య హింసకు సీఎం పాత్ర ఉన్నట్లుగా కొన్ని ఆడియో క్లిప్‌లు లీకయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు ఈ టేపులను కుకీ సంస్థ సమర్పించింది. అలాగే దీనిపై దర్యాప్తు కోసం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాని సుప్రీంకోర్టును కూడా కోరింది.
మరోవైపు ఈ టేపుల ప్రామాణికతను నిర్ధారించడానికి తగిన ఆధారాలు సమర్పించాలని కుకీ సంస్థను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అయితే రాష్ట్రంలో శాంతి ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి ఈ నకిలీ ఆడియో టేప్‌లను సృష్టించారని మణిపూర్ ప్రభుత్వం ఆరోపించింది.
More Stories
స్వతంత్ర దర్యాప్తు జరిపేవరకు జైల్లోనే ఉంటా
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర… బిజెపి ఆరోపణ
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్