కేంద్ర మంత్రి కుమార‌స్వామిపై వ‌ర్ణ‌వివ‌క్ష వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి కుమార‌స్వామిపై వ‌ర్ణ‌వివ‌క్ష వ్యాఖ్య‌లు

కేంద్రమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమార‌స్వామిని న‌ల్ల‌వాడు అంటూ క‌ర్నాట‌క మంత్రి బీజెడ్ జ‌మీర్ అహ్మ‌ద్ ఖాన్‌ చేసిన వ‌ర్ణ‌వివ‌క్ష వ్యాఖ్య‌లు వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. జమీర్ అహ్మద్- కాలీయ (నలుపు రంగు) కుమారస్వామి బీజేపీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి.

జమీర్ చేసిన జాత్యంహకార వ్యాఖ్యలను జేడీఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశాయి. ఇటీవల సీపీ యోగీశ్వర అనే కాంగ్రెస్ నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికే చేరారు.

ఈ అంశంపై మాట్లాడిన జమీర్, “మా పార్టీలో ఉన్న అభిప్రాయ భేదాల వల్ల యోగీశ్వర స్వతంత్రంగా పోటీలో నిలబడ్డారు. కానీ తరువాత వేరేదారిలేక బీజేపీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ‘కాలీయ (నలుపు రంగు) కుమార స్వామి బీజేపీ కన్నా ప్రమాదకారి. అందుకే యోగీశ్వర జేడీఎస్ పార్టీలోకి వెళ్లలేదు” అని వ్యాఖ్యానించారు.

‘రంగు’ గురించి జమీర్ మాట్లాడడంపై జేడీఎస్ తీవ్రంగా స్పందించింది. జమీర్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసింది. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్సీ మహదేవప్ప, ప్రియాంక్ ఖర్గే ఏ రంగులో ఉన్నారో చెప్పాలని నిలదీసింది’.

తాజా వివాదంపై జమీర్ స్పందించారు. తనకు హెచ్డీ దేవెగౌడ రాజకీయ గురువు అని పేర్కొన్నారు. ఆయన తనయుడైన కుమారస్వామిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, ఆయన అంటే తనకు ఎంతో అభిమానం ఉందని చెప్పుకొచ్చారు.  “కుమారస్వామి నన్ను ‘కుల్లా’ (పొట్టోడు, మరుగుజ్జు) అని అంటారు. నేను ఆయనను కర్రియన్న (నల్ల సోదరుడు) అని అంటాను. మాది ఎప్పటి నుంచో ఉన్న స్నేహం. మేము పరస్పరం చాలా కాలంగా ఇలానే అనుకుంటూ ఉన్నాం. ఇందులో తప్పేముంది” అని సమర్ధించుకున్నారు.

కర్ణాటకలోని చన్నపట్న ఉపఎన్నికల్లో జేడీఎస్ నేత కుమారస్వామి తనయుడైన నిఖిల్ పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ- జేడీఎస్ కూటమి తరఫున పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి యోగీశ్వర పోటీలో ఉన్నారు.

జమీర్ అభ్యంతరకర వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇలా జాత్యంహకార వ్యాఖ్యలు చేయడం అలవాటేనని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఓ పోస్టు పెట్టారు.  ఆ పోస్టులో శామ్ పిట్రోడా – ‘దక్షిణ భారతీయులు నల్లగా ఆఫ్రికన్స్లాగా, ఈశాన్య భారతదేశంలోని ప్రజలు చైనీయులులాగా, ఉత్తర భారతదేశంలోని ప్రజలు అరబ్బులలాగా తెల్లగా ఉంటారు’ అని చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయి.