సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయంపై సీఐడీ దర్యాప్తు

సీఎం కోసం ఉంచిన సమోసాలు మాయంపై సీఐడీ దర్యాప్తు
ముఖ్యమంత్రి కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. సీఎం భద్రతా సిబ్బందికి వాటిని సర్వ్‌ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఐడీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్‌ పాలిత హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 

అక్టోబర్‌ 21న సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులతో కలిసి ఆయన టీ తాగారు. అయితే సీఎంకు సర్వ్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఉంచిన మూడు బాక్సుల సమోసాలు మాయమయ్యాయి. దీంతో సీఐడీ అధికారులు గందరగోళానికి గురయ్యారు.

కాగా, సీఐడీ కార్యాలయంలోని మహిళా అధికారిణి ఆ సమోసాల బాక్సులను సీఎం భద్రతా సిబ్బందికి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీఎం కోసం ఉంచిన ఆ సమోసాలు వారు తిన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రతిపక్షమైన బీజేపీ దీనిపై విమర్శలు గుప్పించింది. సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు కోసం ఉంచిన సమోసాలు మాయం కావడంపై సీడీఐ దర్యాప్తు చేస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో ఆరోపించింది.

అయితే సీఐడీ దీనిని ఖండించింది. కేవలం అంతర్గతంగా ఆరా తీసినట్లు సీఐడీ డీజీ తెలిపారు. సీఎంవో కార్యాలయం కూడా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టింది. బీజేపీకి ఏ సమస్యలు కనిపించకపోవడంతో ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని మీడియా ప్రధాన సలహాదారుడు నరేష్ చౌహాన్ విమర్శించారు.