
ఇటీవల కెనడాలోని హిందూ ఆలయపై జరిగిన దాడి ఘటనను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇది అవివేక చర్య అని, అది సిక్కులకు, వారి గురువులకు కూడా అవమానకరమని వ్యాఖ్యానించారు.
ఘటనకు పాల్పడిన వ్యక్తులు హిందువులనే కాకుండా సిక్కులనూ అవమానపరిచారని స్పష్టం చేశారు. వర్గాలుగా విడిపోవడం కంటే ప్రతి ఒక్కళ్లూ మానవత్వంతో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మం కోసం పది మంది సిక్కు గురువులు జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేస్తూ శ్రీశ్రీ రవిశంకర్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
‘హిందూ ఆలయంపై దాడి దురదృష్టకర ఘటన. ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. శాంతికి నిలయమైన కెనడాలో ఇలాంటివి పునరావృతం కాకూడదు. అక్కడ ఎన్నో ఏళ్లుగా అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. వర్గాల వారీగా కాకుండా మానవత్వంతో కలసి పనిచేయాలి” అని ఆయన హితవు చెప్పారు.
దాడికి పాల్పడిన వ్యక్తులు దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. ఆలయాల రక్షణకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు మతానికి చెందిన 10 మంది గురువులు తమ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారి త్యాగాలను కొందరు వ్యక్తులు అవమానిస్తున్నారని రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ ఆలయంలోకి చొరబడిన ఖలీస్థాన్ వేర్పాటువాదులు అక్కడ భక్తులపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఒంటారియో రాష్ట్రం బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయం వద్ద ఖలిస్థాన్ జెండాలు చేతబూని, అక్కడ జరుగుతున్న హిందువుల సభపైకి దూసుకెళ్లారు. సభకు హాజరైన భక్తులపై దాడి చేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు.
మహిళలను, పిల్లలను సైతం వదల్లేదని ‘హిందూ కెనడియన్ ఫౌండేషన్’ ఆరోపించింది. కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులతోనే ఇదంతా జరుగుతుందని మండిపడ్డారు. ఈ ఘటనను కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సహా వివిధ రాజకీయ నాయకులు ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. అటు, భారత్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ట్రూడో ప్రభుత్వం తీరుపై మండిపడింది.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చిట్నిస్ కన్నుమూత
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా