ఇది రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వం అంటూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేశారు. కూల్చడంలో సీఎం జగన్ అద్భుతమైన ప్రతిభ చూపారని ఎద్దేవా చేశారు. భుత్వం చర్యతో కాంట్రాక్టర్లు సర్వనాశనం అయిపోయారని మండిపడ్డారు.
వైసీపీ సర్కారు అనాలోచిత చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి గమనించాలని హితవు చెప్పారు. రివర్స్ టెండరింగ్ వల్ల లాభం లేదని స్పష్టం చేశారు. జగన్ పాలన మీద ప్రజలు విసిగెత్తిపోయారని చెప్పారు.
ప్రధాని మోదీని జగన్ కలవడంలో తప్పు లేదని అంటూ ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఏపీలో ఉన్న మందు బ్రాండ్లు ఇంకా ఎక్కడ కనబడవని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది నరేంద్రమోదీ కల. అందుకే అద్భుతమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
ఈ విషయంలో గత ప్రభుత్వం బాగా చొరవ చూపిందని టిడిపి ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్రం 7 లక్షల పైగా ఇళ్లను ఏపీకి కేటాయించిందని తెలిపారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు నిర్మాణం ఆపేశారని విమర్శించారు. టెండర్లు రద్దు చేశారని అంటూ విశాఖలో గతంలో వచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయడం దారుణం అని ధ్వజమెత్తారు.

More Stories
ఆంధ్ర తీరంలో తమిళనాడు బోట్ల ఆగడాలు
అమరావతే రాజధాని.. చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
నౌకాదళంలోకి అణు సామర్ధ్యం గల ఐఎన్ఎస్ అరిదమాన్