వైసీపీ, టీడీపీలతో బీజేపీ కలిసే పరిస్థితి లేదు  

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం బిజెపి ప్రతిపక్షం టిడిపితో గాని, అధికార పక్షం వైసీపీతో గాని కలిసే ప్రసక్తి లేదని బిజెపి ఎమ్యెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలసిన సందర్భంగా వైసిపి ఎన్డీయేలో చేరబోతున్నదని, కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నదని సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చిన ఊహాగానాలకు స్పందిస్తూ ఆయన ఈ వివరణ ఇచ్చారు. 

ఈ విషయంలో బీజేపీ అధిష్టానం స్పష్టతతో ఉందని కూడా మాధవ్ తేల్చి చెప్పారు. జగన్‌ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏలోకి వైసీపీ అనే ప్రచారం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. పైగా, కేబినెట్‌లోకి రమ్మన్నారని వైసీపీనే ప్రచారం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. 

సీబీఐ కేసుల నేపథ్యంలో వైసిపి నేతలు రకరకాల అంశాలు తెరపైకి తెస్తున్నారని, ప్రధాని మోదీ సానుకూలంగా తమ పట్ల ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలో వైసీపీ ప్రభుత్వంతోనూ కేంద్రం అదే విధంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.