‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలుచేస్తాం’ అంటూ యువత, నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక ఉద్యోగం భర్తీ చేయకపోగా, కనీసం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. కనీసం జాబ్ క్యాలెండరు కూడా ప్రకటించలేదు.
ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా తీసుకొని ఈ విషయమై తగు సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తితో ఏకసభ్య కమిషన్ నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వెంటనే ఈ కమిషన్ నివేదిక చేతికి వచ్చి, అమలు పరచే వరకు ఉద్యోగాల భర్తీ చేయవద్దని అంటూ పలువురు కోరటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదీ కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది.
ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపించి కనీసం మరో ఆరు నెలలపాటు నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాల భర్తీని పక్కనపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైన్నట్లు వెల్లడి అవుతుంది. దీంతో మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తామని చేసినా ప్రగల్భాలను ఆటకెక్కించినట్లే అవుతుంది.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటిస్తూ 60 రోజుల్లో నివేదికను తెప్పించాలని గడువుగా విధిస్తున్నట్లు తెలిపారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే నూతన నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీ అంటూ సెలవిచ్చారు. అంటే ఈ నివేదిక వచ్చే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు స్పష్టం చేశారు.
ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని భర్తీచేయరన్న మాట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నియమించిన విచారణ సంఘాల సంగతి చూస్తే నిరుద్యోగ యువత ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రభుత్వం రెండు విచారణ సంఘాలను నియమించింది.
మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆయా కమిషన్ లకు సూచించింది. కానీ 8 నెలలు దాటినా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. గడువును పొడిగిస్తూనే వస్తున్నారు. ఇదే తరహాలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక 60 రోజుల్లో సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నివేదిక వచ్చేదెన్నడు? అమలుచేసేదెన్నడు? ఉద్యోగాలు భర్తీ అయ్యేదెన్నడు? అన్న ప్రశ్నలు నిరుద్యోగులను పీడిస్తున్నాయి.
మొత్తంగా ప్రణాళిక బద్ధంగా ఉద్యోగాల భర్తీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వేసిన పన్నాగమని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిస్థితులను చూస్తుంటే కనీసం వచ్చే ఏడాది మధ్య వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

More Stories
అర్బన్ నక్సల్స్ తో తెలంగాణ విద్యావిధానమా?
రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!
దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన పార్టీ బిజెపి