తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం

తెలంగాణలో ఏపీ క్యాడర్ అధికారుకు ఏపీ వెళ్లాలని ఆదేశం

Amrapali Kata

 
తెలంగాణలోని ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.  కేంద్రం ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రాస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి సహా 11 మంది ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్టు చేయనున్నారు. అలాగే ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
వీరంతా తమకు తెలంగాణ కేడర్ కావాలని గతంలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం సొంత రాష్ట్రాలకు వెళ్లాలని సూచించింది. వెంటనే సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి కాట, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీ రోనాల్డ్ రాస్ ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది.
 
మరోవైపు ఐఏఎస్ ఆమ్రపాలిని విభజన సమయంలో ఏపీకి కేటాయించారు. తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఖండేకర్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 
 
దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి ప్రస్తుతం ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కీలక బాధ్యతల్లో ఉన్నారు.
 
గతంలో రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ వీరందరినీ ఏపీ క్యాడర్ కు కేటాయించగా.. వీరంతా తెలంగాణ క్యాడర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపారు. కానీ కేంద్రం వారికి నో చెప్పింది. దీంతో వీరంతా క్యాట్, కోర్టుల్ని ఆశ్రయించారు. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కానీ మరోసారి ఏపీలో ఏఐఎస్ అధికారుల కొరత కారణంగా వీరిని ఏపీకి కేటాయిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉండటంతో వీరి జాయినింగ్ పై ఉత్కంఠ నెలకొంది.