ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మరో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో ఈ దుర్ఘటన జరిగింది. రథయాత్రకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఈ క్రమంలోనే రథం లాగేందుకు ప్రయత్నిస్తుండగా.. తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఈ తొక్కిసలాట ఘటనలో ఊపిరాడక ఒక భక్తుడు మరణించగా పలువురు గాయపడ్డారు. పూరీలోని జగన్నాథ దేవాలయం నుంచి గుడించా దేవాలయం వరకూ 2.5 కి.మీ పొడవునా ఈ రధయాత్ర సాగింది. వెంటనే అధికారులు, పోలీసులు స్పందించి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు పూరీకి తరలి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. ఆ తర్వాత బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది.
ఈ క్రమంలోనే రథం లాగేందుకు భక్తులు ఎగబడటంతో వారి మధ్య తోపులాట జరిగింది. రథాలలో చెక్క గుర్రాలను ఉంచి.. భక్తులకు రథాలను సరైన మార్గంలో లాగేందుకు సేవాదారులు మార్గనిర్దేశం చేశారు. ఆ సమయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు ప్రదక్షిణ చేసి.. దేవతలకు నమస్కరించారు.
ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ద్వితీయ తిధి 4.26 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర సోమవారం ఉదయం 4.59 గంటలకు ముగియనుంది. పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలోకల్లా ఈ పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకమైంది.
ఇక ఈ పూరీ జగన్నాథ రథయాత్రకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ రథయాత్ర.. ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు.

More Stories
పేలుళ్లకు కుట్రలో నలుగురు ఉగ్రవాదులు అరెస్టు
30 ఏళ్ల నాటి కేసులో కాశ్మీరీ వేర్పాటువాది అరెస్ట్
ప్రధాని తీవ్ర అసంతృప్తి.. దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపు