అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక 10 రోజుల ప్రాయశ్చిత్త, శుద్ధి పూజల్ని ప్రారంభించింది. ఆలయంలో జరిగిన విరాళాల దుర్వినియోగంతో కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతిన్నందున, భగవంతుడికి క్షమాపణలు కోరుతూ ఆలయ పవిత్రతను, గౌరవాన్ని పునరుద్ధరించడమే ఈ పూజల ఉద్దేశమని ట్రస్ట్ తెలిపింది.
ఇదే సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించనుంది. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సంకల్పంతో బుధవారం ఈ శుద్ధి క్రతువు ప్రారంభమైంది. ఇందులో భాగంగా అయోధ్యలోని గురుకులాల విద్యార్థులు రోజూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనీసం 251 సార్లు పారాయణం చేస్తున్నారు.
హిందూ విశ్వాసాల ప్రకారం సమాజంలో సానుకూలతల్ని పెంచి అష్టైశ్వర్యాలను ఇచ్చే శ్రీ మహా విష్ణువు సహస్రనామాలతో (1000 నామాల జపం) పాటు వాల్మీకీ రామాయణ పారాయణాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ‘విరాళాల దుర్వినియోగం కారణంగా ఆలయ పవిత్రత, గౌరవం దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకే ఈ ప్రత్యేక ప్రాయశ్చిత్త, శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాం.’ అని గోవింద్ దేవ్ గిరి తెలిపారు.
విరాళాల వ్యవహారం భక్తుల్ని తీవ్రంగా బాధించిందని, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా ఆలయంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ పారాయణాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ట్రస్ట్ సభ్యుడు దినేంద్ర దాస్. కాగా, సిట్ తుది నివేదికలో ఆలయ పరిపాలన, విరాళాల లెక్కింపు వ్యవస్థలో సంస్కరణలపై కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది. జులై 22న అయోధ్యలో జరగనున్న ట్రస్ట్ సమావేశంలో వాటిపై చర్చించనున్నారు.

More Stories
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి
హర్మూజ్ నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదు