కూల్చివేతల నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బందిని మోహరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందిని కూడా సిద్దం చేశారు. అభిషేక్ బెఞ్జరీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అమ్తాలలో ఈ పార్టీ కార్యాలయం ఉంది.
ఈ కూల్చివేతతో పెద్దఎత్తన గుమిగూడిన బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ, పార్టీకి మద్దతుగా నినాదాలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఈ భవనాన్ని నిర్మించారని ఆరోపిస్తూ అమ్తాల బీజేపీ ఎమ్మెల్యే అగ్నిశ్వర్ నస్కర్ ఈ చర్యను స్వాగతించారు. ‘‘ఈ కట్టడాన్ని అక్రమంగా నిర్మించారు, చివరకు యంత్రాంగం చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంది’’ అని నస్కర్ చెప్పారు.
అనధికార నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా విచారణకు హాజరు కావాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ‘‘చట్ట నిబంధనలకు కట్టుబడి పరిపాలన యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అనధికార నిర్మాణం జరిగిందంటూ ఫిర్యాదులు అందిన తర్వాత నోటీసులు జారీ చేశాం. ఈ అంశం విచారణలో ఉంది’’ అని దక్షిణ 24 పరగణాల జిల్లా పరిపాలన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
‘విచారణ తర్వాత, సంబంధిత చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం నుంచి పార్టీ కార్యాలయం చుట్టూ అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆవరణ చుట్టూ గార్డ్‌రైల్స్‌ను ఏర్పాటు చేయగా, సీనియర్ పోలీసు, పౌర పరిపాలన అధికారులు ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా యంత్రాంగం జారీ చేసిన నోటీసుల ప్రకారం టీఎంసీ పార్టీ కార్యాలయం ఉన్న భూమిని ‘లీప్స్ అండ్ బౌండ్స్’ అనే సంస్థ పేరు మీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ యాజమాన్యానికి సంబంధించిన పత్రాలు, నిర్మాణానికి సంబంధించిన రికార్డులపై కూడా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో కోరారు. సంబంధిత వ్యక్తులకు జారీ చేసిన రెండు నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో, కూల్చివేతతో ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించినట్లు పరిపాలనా వర్గాలు తెలిపాయి.

More Stories
అయోధ్యలో ప్రత్యేక 10 రోజుల ప్రాయశ్చిత్త, శుద్ధి పూజలు
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి