ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని మోదీ ఎన్నిక

ఎన్డీయే పక్ష నేతగా ప్రధాని మోదీ ఎన్నిక
 
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ విధానాల కారణంగా గత పదేళ్లలో దేశంలోని 140కోట్ల మంది ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు.
 
మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖలపై మరో 19 పార్టీ ల నేతలు సంతకాలు చేశారు. ఆ లేఖను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్డీయే నేతలు అందివ్వ నున్నారు
 
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
 
“దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో  ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించింది” అని తీర్మానంలో తెలిపారు. 
 
“మోదీ నాయకత్వంలోని  ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న, అణగారిన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉంది. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది” అంటూ కూటమి నేతలు ప్రకటించారు.
మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. దీంతో జూన్‌ 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే నేతలు కలువనున్నారు. జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీయే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నది.

డిల్లీ కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే నేతగా మోదీ రికార్డులకెక్కనున్నారు.

ఇలా ఉండగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర మంత్రివర్గం  బుధవారం ఉదయం సిఫారసు చేసిన వెంటనే మోదీ తన రాజీనామాతో పాటు మంత్రివర్గ రాజీనామా పత్రాలను రాష్ట్రపతిని కలిసి నేరుగా కలిసి సమర్పించారు. 

రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలుపుతూ, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంతవరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. అనంతరం కొద్ది గంటలకే 17వ లోక్‌సభను రద్దయినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.  ”జూన్ 5వ తేదీ 2024న కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసు మేరకు రాజ్యాంగంలోని 85వ నిబంధన సబ్-క్లాజ్ (2) కింద నాకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ 17వ లోక్‌సభను రద్దు చేస్తున్నాను” అని రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

ఖర్గే ఇంట్లో ‘ఇండియా’ సమావేశం

మరోవైపు ఇండియా కూటమి నేతలు సైతం తదుపరి వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. రాజ్యాంగ విలువలను కాపాడే నిబద్ధత ఉన్న పార్టీలను కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాము ఐక్యంగా, కృతనిశ్చయంతో పోరాడామని పేర్కొన్నారు. 

ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి స్పష్టమైన నైతిక పరాజయమని, వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు భారీ నష్టమని తెలిపారు. ప్రజా తీర్పు మోదీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకంగానే వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని తారుమారు చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని ఖర్గే విమర్శించారు.  కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు శరద్‌ పవార్‌, స్టాలిన్‌, చంపయీ సోరెన్‌, తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.