ఏపీలో పెట్రోల్ బంక్‌లపై ఆంక్షలు

ఏపీలో పెట్రోల్ బంక్‌లపై ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంక్‌లపై ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంక్‌లలో ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.  ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోలు బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
సాధారణ ఎన్నికల నియామవళి ప్రకారం కంటెయినర్లు, సీసాల్లో పెట్రోలు, డీజిల్‌ నింపవద్దని సూచించింది. ఓట్ల లెక్కింపు తదుపరి చర్యలు పూర్తయ్యే వరకు వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది. పౌరసరఫరాలశాఖ ద్వారా రాష్ట్రంలోని పెట్రోల్‌, డీజిల్‌ బంకు యజమానులకు నోటీసులు అందాయి. అందులోని నిబంధనలు ఉల్లంఘిస్తే బంకు లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది.
 
ఖాళీ బాటిల్లలో పెట్రోల్ పడితే బంక్ యాజమానిపై క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఎన్నికల అనంతరం అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. .  ఈ మేరకు రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. 
 
ఓట్ల లెక్కింపు అనంతరం కూడా ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా విభాగం అప్రమత్తం చేయడంతో ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. పైగా, ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
పల్నాడు ప్రాంతంలో ఇరు వర్గాలు పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి మరోవైపు బంక్ యాజమాన్యం తప్పక జాగ్రత్తలు పాటించాలని ఈసీ, పౌరసరఫరాలశాఖ ఆదేశాలను యజమానులందరూ తప్పనిసరిగా పాటించాలని డీలర్ల సమాఖ్య అధ్యక్షులు రావి గోపాలకృష్ణ  పెట్రోల్ బంక్ యాజమాన్యాలను కోరారు.