పోలింగ్‌కు ముందే జారిపోతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

పోలింగ్‌కు ముందే జారిపోతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు
టికెట్‌ కోసం దరఖాస్తులు, టికెట్‌ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు, తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయడమో ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో కనిపించే దృశ్యం. కానీ, ఇప్పుడు టికెట్‌ ఇచ్చినా ‘మేము పోటీ చేయలేం బాబోయ్‌’ అంటూ ఆ పార్టీ అభ్యర్థులు తిరస్కరిస్తున్నారు! నామినేషన్‌ను సైతం ఉపసంహరించుకొని పోలింగ్‌కు ముందే చేతులెత్తేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు. 
 
మొన్న సూరత్‌లో, తర్వాత ఇండోర్‌లో, ఇప్పుడు పూరిలో జరిగిందిదే.  మోదీని గద్దె దింపుతామని ఆ పార్టీ చెప్పుకుంటున్నా అందుకు తగ్గ పోరాటస్ఫూర్తి మాత్రం ఆ పార్టీ అభ్యర్థుల్లో నింపలేకపోతున్నది. మనం గెలుస్తున్నామనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నది. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నడూ చూడని దయనీయ స్థితిని కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్నది.
తాజాగా, ఒడిశాలోని పూరీ అభ్యర్థిగా మాజీ జర్నలిస్టు సుచరితా మొహంతీని కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే, తాను పోటీ చేయనని అంటూ ఆమె  టికెట్‌ను తిరస్కరించారు. ‘నా దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేసేశా. ఆర్థిక సహకారం అందించేందుకు పార్టీ అధిష్ఠానం నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో పొటీ చేయలేను’ అని ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు.

తొలుత అహ్మదాబాద్‌ ఈస్ట్‌ స్థానానికి అభ్యర్థిగా రోహన్‌ గుప్తాను కాంగ్రెస్‌ ఖరారు చేయగా ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత సూరత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఆయన బీజేపీతో ఒప్పందంలో భాగంగానే నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యేలా చేసుకున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. 

తర్వాత ఇండోర్‌లో అభ్యర్థి అక్షయ్‌ కాంతి బామ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకొని బీజేపీ నేతలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్‌ పెద్దలు చెప్తున్న మాటలు ఆ పార్టీ అభ్యర్థుల్లోనే నమ్మకాన్ని కల్పించలేకపోతున్నాయి.

అభ్యర్థుల్లో గెలుపుపై నమ్మకాన్ని, పోరాట స్ఫూర్తిని కలిగించడంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ విఫలమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్‌ తిరస్కరించే వారికి, నామినేషన్లు ఉపసంహరించుకునే వారికి, బీజేపీతో టచ్‌లో ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నదంటే కాంగ్రెస్‌ ఎంత దయనీయ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.

ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానంలో పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు సుచరితా మొహంతీ ప్రకటించడంపై కాంగ్రెస్‌ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆర్థిక సహకారం లేదన్న ఆమె ఆరోపణలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఖండించారు. పూరీలో అభ్యర్థిని ఇప్పటికే మార్పు చేశామని, అయితే రేసు నుంచి సుచరిత తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోలేదని, అభ్యర్థి మార్పు అనేది పార్టీ వ్యూహంలో ఒక భాగమని తెలిపారు.