ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తాం

ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తాం
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడ్ ప్రకటించారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం జరిగిన మాదిగల విశ్వరూప సభలో పాల్గొంటూ  దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని పేర్కొంటూ అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
 
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మాదిగలను విరోధులుగా చూస్తున్నామని ధ్వజమెత్తారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారని చెబుతూ బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని కొనియాడారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.
 
“మాదిగలకు అన్యాయం జరిగిందని మేం భావిస్తున్నాం. మాదిగల బిడ్డ బంగారు లక్ష్మణ్‌ నేతృత్వంలో నేను పనిచేశా. ఓ కార్యకర్తగా బంగారు లక్ష్మణ్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. తెలంగాణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం కలిచివేస్తోంది. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను మీతో కలిసి పనిచేస్తా” అని ప్రధాని తెలిపారు.
 
“30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు.. మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉంది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అనేది మా విధానం. మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు” అంటూ హర్షద్వానాల మధ్య ప్రధాని ప్రకటించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత నేతను సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటతప్పారని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారని, ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. 

దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఇస్తున్నారని  మోదీ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడలేకపోయారని మండిపడ్డారు. దళిత బంధు పథంతో బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగిందని చెబుతూ  బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్టు నటిస్తున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ దళిత నేతల్ని అవమానించిందని దుయ్యబట్టారు.

ఇరిగేషన్ పథకాలను స్కామ్ లుగా మార్చారు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్‌ పథకాలను స్కామ్‌లుగా మార్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. లిక్కర్‌ స్కామ్‌లో ఆప్, బీఆర్ఎస్ పార్టీల ప్రమేయం ఉందని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు అవకాశవాద రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను రెండు సార్లు ఓడించిందని, పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో అంబేడ్కర్‌ ఫొటో కూడా పెట్టలేదని గుర్తు చేశారు. అంబేడ్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదని చెబుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అంబేడ్కర్ భారతరత్న అవార్డు ఇచ్చిందని తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని, దళిత బిడ్డ రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి చేసినప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించిందని మోదీ విమర్శించారు.

“పేదరిక నిర్మూలనే మా ప్రధమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చా. ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నాం.” అని మోదీ చెప్పారు.

కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్‌, డా. కె. లక్ష్మణ్‌, మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. మహాసభ వేదికపై మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టగా మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ భుజం తట్టి ఓదార్చారు.

విశ్వరూప మహాసభకు వచ్చిన మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. “ఈ సభకు ప్రధాని మోదీ వస్తారని మేం ఊహించలేదు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది.” అంటూ మందకృష్ణ భావోద్వేగంతో చెప్పారు.

‘ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. పూరి గుడిసెల్లో నివసించాం. వర్షం కురిస్తే తడుస్తూ, వణుకుతూ ఓ మూలన నక్కి తల దాచుకున్నాం. ఓ పూట తింటే, ఓ పూట పస్తులుండి కష్టాలు పడ్డాం. చెప్పులు కుట్టుకొని బతికాం. మా లాంటి వాళ్లకు అండగా ఉండేందుకు వచ్చిన మీకు (ప్రధాని మోదీ) ధన్యవాదాలు’ అని మందకృష్ణ చెప్పారు.