బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత నేతను సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటతప్పారని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారని, ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.
దళిత బంధు పథకం కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఇస్తున్నారని మోదీ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడలేకపోయారని మండిపడ్డారు. దళిత బంధు పథంతో బీఆర్ఎస్ నేతలకే మేలు జరిగిందని చెబుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్టు నటిస్తున్నారని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ దళిత నేతల్ని అవమానించిందని దుయ్యబట్టారు.
ఇరిగేషన్ పథకాలను స్కామ్ లుగా మార్చారు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పథకాలను స్కామ్‌లుగా మార్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి బీఆర్‌ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌లో ఆప్, బీఆర్ఎస్ పార్టీల ప్రమేయం ఉందని పేర్కొంటూ తెలంగాణ ప్రజలు అవకాశవాద రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ అంబేడ్కర్‌ను రెండు సార్లు ఓడించిందని, పార్లమెంట్ సెంట్రల్ హాలులో అంబేడ్కర్ ఫొటో కూడా పెట్టలేదని గుర్తు చేశారు. అంబేడ్కర్‌కు భారతరత్న కూడా ఇవ్వలేదని చెబుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అంబేడ్కర్ భారతరత్న అవార్డు ఇచ్చిందని తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందని, దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని మోదీ విమర్శించారు.
“పేదరిక నిర్మూలనే మా ప్రధమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చా. ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నాం.” అని మోదీ చెప్పారు.
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, డా. కె. లక్ష్మణ్, మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. మహాసభ వేదికపై మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టగా మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ భుజం తట్టి ఓదార్చారు.
విశ్వరూప మహాసభకు వచ్చిన మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. “ఈ సభకు ప్రధాని మోదీ వస్తారని మేం ఊహించలేదు. ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు. ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది.” అంటూ మందకృష్ణ భావోద్వేగంతో చెప్పారు.
‘ఈ సమాజం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. పూరి గుడిసెల్లో నివసించాం. వర్షం కురిస్తే తడుస్తూ, వణుకుతూ ఓ మూలన నక్కి తల దాచుకున్నాం. ఓ పూట తింటే, ఓ పూట పస్తులుండి కష్టాలు పడ్డాం. చెప్పులు కుట్టుకొని బతికాం. మా లాంటి వాళ్లకు అండగా ఉండేందుకు వచ్చిన మీకు (ప్రధాని మోదీ) ధన్యవాదాలు’ అని మందకృష్ణ చెప్పారు.

More Stories
బిజెపి చిహ్నాలతో హింసను రెచ్చగొడుతున్న టిఎంసి!
పంజాబ్ జంట ప్రేలుళ్ళ వెనుక పాక్, ఐఎస్ఐ ప్రమేయం!
గవర్నర్ ను కలిసిన విజయ్ …. రేపే ప్రమాణం!