కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టిపిసిసి మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జనగాం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించిన కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.

‘‘45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా. 45 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు.’’ అంటూ పొన్నాల మీడియా సమావేశంలో  భావోద్వేగానికి గురయ్యారు.

తన రాజీనామా లేఖను పొన్నాల అధిష్ఠానానికి పంపారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతుందని పొన్నాల ఆరోపించారు. కొందరు నేతల వైఖరితో పార్టీ పరువు మట్టిలో కలుస్తోందని ధ్వజమెత్తారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.

అవమానాలు ఎదుర్కొని పార్టీలో ఉండలేనని తెలిపారు. సీనియర్లకు కూడా అధిష్ఠానం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానించారని పొన్నాల చెప్పారు.  తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం జనగామలో 2014లో కూడా భారీతేడాతో ఓడిపోయారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ ఆశించినా, ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఓటమి పాలవడం ఆ పార్టీకి అప్రతిష్టగా మారింది.

ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి నేదురుమల్లి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్‌. క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్‌ క్యాబినెట్‌లలో మంత్రిగా కొనసాగారు.