ధరణి లావాదేవీలపై విచారణకు సిట్

ధరణి లావాదేవీలపై విచారణకు సిట్
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వివిధ శాఖల అధికారులు, నిపుణులతో ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలనీ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో దాదాపు 40 శాతం వర్షపాతం లోటు ఉందని తెలిపారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు సరఫరాపై వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.
 
2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్‌, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. 
 
అందుకే భూముల లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ రికార్డులు, లాగిన్‌ వివరాలు, రికార్డుల్లో చేసిన మార్పులు, అధికారుల అనుమతులు, భూముల వర్గీకరణ మార్పులు, లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు. ధరణి నుంచి ప్రస్తుత భూభారతి వరకు ఈ సమగ్ర విచారణ జరుగుతుందని చెప్పారు. 
 
ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌)’ పాత్రతో పాటు పోర్టల్‌ నిర్వహణ సంస్థ ఎంపిక, టెండర్‌ ప్రక్రియ, వెండర్‌కు కాంట్రాక్టు కేటాయింపు, పోర్టల్‌ రూపకల్పన, సిస్టమ్‌ ఆర్కిటెక్చర్‌, డేటా భద్రతలో ఉన్న లోపాలపై విచారణ జరపాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. 
 
ధరణిలో పోర్టల్‌ తర్వాత కొన్ని మాడ్యూల్స్‌ను మార్చి రైతులకు ఉపయోగంగా ఉండేలా తమ ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు. అయితే ఆనాటి సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేసిన పోర్టల్‌లోని లోపాలతో ఇప్పటికీ అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. అందుకే ధరణి వ్యవహారంలో బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.