తొలిరోజు వాడీవేడిగా నడిచిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉద్రిక్తల మధ్య శుక్రవారంకు వాయిదా పడ్డాయి. ప్రారంభం నుంచి సభ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై దద్దరిల్లింది. పోడియం వద్దకు వెళ్లి టీడీపీ నేతలు గొడవ చేశారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తింది. తొలిరోజే ఏకంగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ కాగా, అయితే ముగ్గురిని మాత్రం అసెంబ్లీ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా, దానిని స్పీకర్ తమ్మినేని సీతారాంతిరస్కరించారు. సభలో చర్చకు పట్టుబడుతూ సభలో గందరగోళం సృష్టించడంతో సభ ప్రారంభమైన పావు గంటలోనే వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది.
సభ వాయిదా పడటానికి ముందు మంత్రి అంబటి రాంబాబు, బాలకృష్ణల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో బాలకృష్ణ మీసం మెలేయడంపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత బాలకృష్ణ సభా స్థానాన్ని అగౌరవపరిచారని, సభ్యులు తొడలు చరచడం, మీసాలు మెలేసి వికృతంగా ప్రవర్తించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని, ఆయన తొలితప్పుగా భావించి మొదటి వార్నింగ్ ఇస్తున్నామని, ఇలాంటివి పునరావృతం చేయొద్దని హెచ్చరించారు. మరోవైపు శాసన సభా నియామవళిలో 365 నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తిని ధ్వంసం చేస్తే ఆస్తి విలువను సభ్యుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని స్పీకర్ హెచ్చరించారు.
సభా స్థానాన్ని చుట్టుముట్టి కాగితాలు విసిరి సభ ఔన్నతాన్ని దెబ్బతీశారని టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సభ ఆస్తిని ధ్వంసం చేస్తే సభ్యుల నుంచి దానిని రికవరీ చేస్తామని, శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌లు కాగితాలు చించేసి, మానిటర్ పగులగొట్టారని, మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఎథిక్స్ కమిటీని సూచించారు.
అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌పై డోలా బాల వీరాంజనేయులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
స్పీకర్ పొడియం చుట్టూ గందరగోళం కొనసాగడంతొో రూల్ 2 ఆఫ్ 340 ప్రకారం బెందళం అశోక్, కింజరపు అచ్చన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చినరాజప్ప, గద్దె రామ్మోహన్, ఏలూరు సాంబశివరావు, పయ్యావుల కేశవ్, కళా వెంకట్‌రెడ్డి నాయుడు, గొట్టిపాటి రవికుమార్, శ్రీదేవి, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, డోల బాలవీరాంజనేయులు, మంతెన రామరాజులను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేయాలని బుగ్గన ప్రతిపాదించారు.
సభలో సభ్యులపై చర్యలకు బుగ్గన ప్రతిపాదిస్తున్న సమయంలో సభలో కొందరు వీడియో తీస్తున్నారని మంత్రి రోజా ఫిర్యాదు చేయడంతో వారిని సభ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బుగ్గన స్పీకర్‌ను కోరారు. అనగాని, కోటంరెడ్డి, పయ్యావుల కేశవ్‌లను సభ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి