మరి కొద్ది రోజుల్లో ప్రతిష్టాకరమైన జి20 శిఖరాగ్ర సదస్సు జరుగనున్న సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్న సమయంలో మెట్రో రైల్వే స్టేషన్ లలో ఖలిస్తాని నినాదాలు కనిపిస్తుండటం కలకలం రేపుతోంది. దేశంలో అక్కడక్కడా ఖలిస్థానీ మద్దతు దారులు వీరంగం సృష్టిస్తూ ఆందోళన కలిగిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రం పంజాబ్, దేశ రాజధాని ఢిల్లీలో అప్పుడప్పుడు ఖలిస్థానీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఇక విదేశాల్లోనూ భారతీయలపై దాడులకు తెగబడటం, భారత రాయబార కార్యాలయాల్లో విధ్వంసాలు, జెండా తొలగించి ఖలిస్థానీ జెండాలు ఎగురవేసిన ఘటనలు కూడా పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని వివిధ మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థానీలకు మద్దతుగా రాతలు వెలుగు చూడటం సంచలనంగా మారింది. వచ్చే నెల రెండో వారంలో దేశ రాజధాని ఢిల్లీలో జీ 20 దేశాధినేతల సమావేశాలు జరగనున్న వేళ ఈ ఘటన తీవ్ర కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఐదు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్థాన్‌కు అనుకూలంగా రాసిన రాతలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
రకరకాల రంగులతో ఖలిస్థాన్ మద్దతుగా నినాదాలని స్ప్రే చేసి ఉండటాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించి ఈ ఘటనలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి దేశ వ్యతిరేక ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను వెంటనే గుర్తించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సిఖ్ ఫర్ జస్టిస్ పేరుతో ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఈ రాతలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని శివాజీ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి పంజాబీ బాగ్ వరకు ఉన్న 5 మెట్రో స్టేషన్లలో ఇలా ఖలిస్థాన్ మద్దతు రాతలు రాసినట్లు పోలీసులు వివరించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఖలిస్థాన్ అనుకూల రాతలను చెరిపేశారు. మెట్రో స్టేషన్లలోని గోడలపై ఉన్న రంగులను మరో రంగు వేసి వాటిని తొలగించేశారు.
ప్రగతి మైదాన్‌లోని కొత్తగా పునర్నర్మించిన అతిపెద్ద కాంప్లెక్స్ జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల గతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో నివసిస్తున్న ఖలిస్థానీ మద్దతుదారులు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు.

More Stories
లక్నో వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు
భారత్‌లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ
ఢిల్లీలో వాయు కాలుష్యం.. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు